కాలభైరవాలతో కలవరం
⇒రాజమండ్రిలో విజృంభిస్తున్న కుక్కలు
⇒బెంబేలెత్తుతున్న నగరవాసులు
⇒నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యం
సాక్షి, రాజమండ్రి : ఆ మూల, ఈ మూల; ఆ వాడ, ఈ వాడ అనిలేదు.. నగరంలో ఎక్కడ చూసినా కుక్కలు గుంపుగుంపులుగా కనిపిస్తున్నాయి. పాదచారులు, ద్విచక్ర వాహనదారుల గుండెల్ని గుబగుబలాడిస్తున్నాయి. అందుకు కారణం ఉంది. 2011లో ఒక్క మే నెలలోనే నగరంలో సుమారు 12 మంది రేబిస్ వ్యాధితో మరణించగా సుమారు 3000 మంది కుక్కకాట్లకు గురయ్యారు. ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సిన్ నిండుకునేంత తీవ్రస్థాయిలో అప్పుడు కుక్కలు విజృంభించాయి.
అనంతరం కుక్కలను నియంత్రించాల్సిన నగర పాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు. చట్టాలను సాకుగా చూపుతూ నిష్ఫలమైన చర్యలతో సరిపుచ్చుతున్నారు. కానీ.. కుక్కల నియంత్రణ పేరుతో 2011 నుంచి వరుసగా ఏడాదికి రూ.15 లక్షలు వెచ్చిస్తూ వస్తున్నారు. ఈ మూడేళ్లలో కాలభైరవాల (కుక్కల) సంఖ్య పెరుగుతూనే వచ్చింది తప్ప తగ్గలేదు.‘కుక్కలను చంపడం జంతు హింసా చట్టం ప్రకారం నేరం.
బ్లూస్టార్ వంటి సంస్థలు కోర్టులో కేసులూ వేశాయి. ఈ నేపథ్యంలో సంతాన నిరోధక వ్యాక్సిన్ లు ఇవ్వడం ద్వారా నగరంలో మూడేళ్లలో కు క్కల సంఖ్యను తగ్గించేందుకు కార్యాచరణ రూపొం దించినట్టు 2011లో కుక్కల విజృంభణ అనంతరం అధికారులు ప్రకటించారు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో కుక్కల్ని పట్టుకుని సంతాన నిరోధక టీకాలు వేయడం, బటన్ హోల్ సర్జరీ ద్వారా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్‌లు చేయడం వంటి విధానాలు అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
2012లో ముందుగా రూ.10 లక్షల అంచనాలు వేసి తర్వాత సవరించి రూ.15 లక్షలు ఖర్చు చేశారు. 2013 లో మరో రూ.15 లక్షలు, తాజాగా రూ.15 లక్షలు కుక్కల సంతాన నిరోధానికి ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. కానీ నగరంలో ఎక్కడా కుక్కల సంఖ్య అదుపులోకి రాలేదు.
నానాటికీ పెరుగుతున్నాయి..
రెండేళ్ల క్రితం చేసిన సర్వే ప్రకారం జిల్లాలో 1.10 లక్షల కుక్కలుంటే ఒక్క రాజమండ్రిలోనే 10 వేలకు పైగా ఉన్నాయని అంచనా. కాగా అవి ఏడాదికి వెయ్యి వంతున పెరుగుతూ గత ఏడాదికి 12 వేలకు చేరుకున్నాయి. తాజాగా నగరంలో మూడు వేలు పెరిగి 15 వేలకు చేరుకున్నట్టు తెలుస్తోంది. వీటి బెడదపై ఈ ఏడాది జూలైలో నగర పాలక మండలి సమావేశంలో చర్చ జరిగింది. కార్పొరేటర్లందరూ అ ధికారుల తీరును తప్పు బట్టినా పరిస్థితి మార లే దు. నగరవాసులకు నిత్యకలవరంగా మారిన ఈ బె డద విరగడకు ఇకనైనా అధికారులు నడుం కట్టాలి.