మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడప్పుడే లేనట్లే. ఎందుకంటే రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
మున్సి‘పోల్ ’ఇప్పట్లో లేనట్టే !
Nov 15 2013 2:26 AM | Updated on Mar 18 2019 7:55 PM
విజయనగరం మున్సిపాల్టీ, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడప్పుడే లేనట్లే. ఎందుకంటే రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు పరోక్షంగా సమాచారం కూడా అందిపోయింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మున్సిప ల్ పాలక వర్గ పదవీ కాలం ముగిసి రెండున్నర ఏళ్లు అయింది. అప్పటినుంచి మున్సిపాలిటీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతోంది. ఈ ఏడాది ఆగస్టులో మున్సిపల్ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఎన్నికలు జరిగితే పీఠాలు అధిరోహించవచ్చని రెండున్నర ఏళ్లగా ఎదురు చూస్తున్న ఆశావహులు భావించారు. ఈ లోగా రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేస్తామని కాంగ్రెస్‌పార్టీ నేతలు ప్రకటన చేయడంతో ఉద్యోగులు, రాజకీయ నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్ర తరంచేశారు. దీంతో ఆగస్టు లో జరగవలసిన మున్సిపల్ ఎన్నికలు నిలిచిపోయాయి. డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని అంతా భావించారు. అయితే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం వెనుకాడుతోంది. రాష్ట్రం రెండుగా విడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ప్రజలు, ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి సమయాల్లో ఎన్నికలకు వెళ్తే పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించకపోవడమే మంచి దన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
ప్రత్యేక అధికారుల పొడగింపు
జిల్లాలో విజయగనరం, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం పురపాలక సంఘాలు, నెల్లిమర్ల నగర పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన గడువు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఈ ఏడాది డిసెంబర్ నెలతో ప్రత్యేక అధికారులపాలన ముగియనుంది. 2014 మార్చి నెల వరకు ప్రత్యేక అధికారులను కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రత్యేక అధికారుల గడువును పెంచడంతో ఇప్పుడప్పుడే ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నట్లు స్పష్టమైంది.
Advertisement
Advertisement