పాతనగరం కోటవీధి ముఖద్వారం వద్ద ఎమ్మెల్యే వాసుపల్లికి వ్యతిరేకంగా నిరసన చేపట్టిన ముస్లిం సోదరులు
విశాఖపట్నం , పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణం): ముస్లింల ద్రోహిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ పాతనగరం ముస్లిం వాడల్లోకి వస్తే తరిమి కొడతామని విశాఖ అర్బన్ టీడీపీ మైనారిటీ వింగ్ మాజీ ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాదిక్ హెచ్చరించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ముస్లింలు వాసుపల్లికి చేసిన మేలును మరిచిపోయారని, అధికారం చేపట్టిన ఐదేళ్ల కాలంలో ముస్లింల సంక్షేమం కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ముస్లిం ప్రజాదర్బార్ పేరిట ప్రతి శుక్రవారం నమాజ్ సమయంలో సమావేశాలు నిర్వహించి ముస్లింల మనోభావాలు దెబ్బతీశాడని ధ్వజమెత్తారు. పాతనగరంలోని మసీదులకు సంబంధించిన మతపెద్దలు ముస్లింలకు ప్రత్యేకంగా కమ్యూనిటీ హాలు నిర్మించాలని పలుమార్లు విన్నవించినా నెరవేర్చలేదన్నారు.
మైనారిటీలకు వర్తించే దుల్హన్ పథకం, ఇళ్ల మంజూరు వంటి విషయాలకు సంబంధించి రాష్ట్రం విడుదల చేస్తున్న నిధుల్లో 90 శాతం వెనక్కి వెళ్లిపోవడానికి కారణం ఎమ్మెల్యే అని దుయ్యబట్టారు. ఈ నిధులపై నిరక్షరాస్యులైన ముస్లింలకు అవగాహన కల్పించాల్సిన ఆయన నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడమే నిధులు వెనక్కివెళ్లడానికి కారణమన్నారు. చెప్పులరిగేలా ఎమ్మెల్యే చుట్టు ముస్లింలు ప్రదక్షిణలు చేస్తున్నా ఏ ఒక్క పథకాన్ని అమలుచేయడం లేదని చెప్పారు. పాతనగరంలోని డీన్‌షాదీఖానాను అధికారం చేపట్టిన ఐదేళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించని ఎమ్మెల్యే ఎన్నికలు సమీపిస్తుండడంతో షాదీఖానా పునరుద్ధరణకు నిధులు మం జూరు చేశానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఐదేళ్ల కాలంలో ముస్లింలను ఎమ్మెల్యే నట్టేటముంచాడని విమర్శించారు. ఎన్నికలకు ముందు ముస్లింలమీద ప్రేమాభినాలు ఉన్నట్టు నటిస్తున్న వాసుపల్లిని ముస్లింలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment