నా భర్తను చంపేశారు
- మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలి
- ఎస్పీని కలిసిన బాధితురాలు
ప్రొద్దుటూరు క్రైం: తన భర్త మహబూబ్‌షరీఫ్‌ను ఆస్తికోసం అత్తింటి వారు అన్యాయంగా చంపేశారని ప్రొద్దుటూరు మండలం పెన్నానగర్‌కు చెందిన తహరున్ అనే మహిళ ఈ నెల 25న ఎస్పీ నవీన్‌గులాఠీని కలిసి ఫిర్యాదు చేసింది. ఆస్తికోసం తన బావ మహ్మద్ఫ్రి తన భర్తను ఈనెల 20న చంపేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. రంజాన్ పండుగకు అమ్మగారింటికి వెళ్లిన తనను పండుగ ముగిసిన తర్వాత ఈ నెల 19న తల్లిదండ్రులు అత్తగారింట్లో వదలి వెళ్లారని ఆమె వివరించింది. ఆరోజు రాత్రి తన భర్తతో కలిసి అక్కడే నిద్రపోయామని, తెల్లవారి చూసేసరికి తన భర్త కనిపించలేదని పేర్కొంది. మిద్దెపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా తన బావ మహ్మద్ఫ్రి వెళ్లనీయలేదని తెలిపింది.
బలవంతంగా అతన్ని తోసి లోపలికి వెళ్లి చూడగా భర్త మహబూబ్‌షరీఫ్ కడ్డీకి వేలాడుతూ కనిపించాడని ఆమె తెలిపింది. తన భర్తకు ఏమైందని అడిగే లోపే తన బావ కాలితో తన్నాడని, కింద పడగానే మెడపై కాలితో తొక్కే ప్రయత్నం చేశాడని తహరున్ ఫిర్యాదులో తెలిపింది. దీంతో ఊపిరి ఆడక పడిపోయిన తనను స్థానికులు ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారని ఆమె పేర్కొంది. భర్త చనిపోయాక కనీసం మృతదేహాన్ని కూడా చూపించలేదని, కుమార్తెను కూడా ఇవ్వకుండా వేధించారని తెలిపింది.
పోలీసులు కూడా తప్పుడు కేసు బనాయించి తన అత్తింటి వాళ్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఎస్పీకి వివరించింది. ప్రస్తుతం ఆమె ప్రొద్దుటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన భర్త మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని కోర్టును ఆశ్రయిస్తున్నట్లు ఆమె పేర్కొంది. కాగా తమ ఫిర్యాదును పరిశీలించి న్యాయం చేయాలని స్వయంగా ఎస్పీ ఆదేశించినప్పటికీ స్థానిక పోలీసులు బేఖాతరు చేస్తున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం దువ్వూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేస్తున్నట్లు తహరున్ కుటుంబ సభ్యులు తెలిపారు.