జనవరి నెలొచ్చింది. భీమవరం కేజీఆర్ జూనియర్ కాలేజీకి సంక్రాంతి సెలవులు ఎప్పుడిస్తారనేది అప్పటికింకా
ప్రకటించలేదు. ఆ రోజు తెలుగు పాఠం అరుుపోరుుంది. విద్యార్థులంతా లెక్చరర్ చుట్టూ చేరి ‘మాస్టారూ.. సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచి’ అనడిగారు. ‘నాకూ తెలీదురా.. అరుునా ఆ విషయం మేం చెప్పకూడదు. నోటీసు బోర్డులో పెడతార్లే’
అన్నారాయన. ‘ఎవర్నడిగినా చెప్పట్లేదు.. మీరైనా చెప్పండి మాస్టారూ’ విద్యార్థులు బేలగా అడిగారు. ‘సర్లే.. చెబుతా ఏడు’ అని సెలవిచ్చారు. విద్యార్థుల మొహాల్లో ఒకటే వెలుగు. ఆయన ఉచ్ఛారణలోని చమత్కారం జనవరి 7నుంచి సెలవులు ఇస్తున్నారని చెప్పకనే చెప్పింది. విద్యార్థులంతా ఎంఎస్‌ఎన్‌గా పిలుచుకునే ఆ మాస్టారి పేరు ఎంఎస్ నారాయణ. లెక్చరర్‌గా చక్కనైన తెలుగును ఎంచక్కా నేర్పించారు. వెండి తెర వెలుగుల్లో జనమంతా హారుుగా నవ్వుతూ మైమరిచిపోతే హఠాత్తుగా అదృశ్యమై నవ్వునూ ఏడిపించారు. శిష్యులను.. అభిమానులను దుఃఖసాగరంలో ముంచేశారు.
నిడమర్రు
అది జనవరి 13వ తేదీ. నిడమర్రులోని ఓ ఇల్లు సందడిగా ఉంది. అది హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ సోదరుడిది. ‘ఆ రోజు తమ్ముడు సరదాగా మాతో గడిపాడు. అందరికీ మిఠాయిలు పంచిపెట్టాడు. ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పాడు. అనారోగ్యంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు’ అంటూ ఎమ్మెస్ సోదరుడు లాలయ్య విలపించారు. జనవరి 13న పెదనిండ్రకొలనులోని మాజీ సొసైటీ అధ్యక్షుడు కూనపురాజు కుమారస్వామిరాజు నివాసంలో స్నేహితులతో చివరి సారిగా గడిపారు.
దొంగ సూరిగాడు
నిడమర్రు గ్రామంలోని రైతు కుటుంబానికి చెందిన మైలవరపు బాపిరాజు, వెంకటసుబ్బమ్మ దంపతులకు మూడో సంతానంగా 1951 ఏప్రిల్ 16న ఎమ్మెస్ నారాయణ జన్మించారు. ఆయనకు అక్క, అన్న, అయిదుగురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లున్నారు. బాల్యంలో తోటి స్నేహితులతో కలసి రాత్రి వేళల్లో గ్రామంలోని మోతుబరి పొలాల్లో పండించిన కూరగాయలు, ఆకుకూరలు దొంగిలించి పేదవారి ఇళ్ల గుమ్మాల ముందుంచేవారని గ్రామస్తులు చెబుతారు. దీంతో గ్రామంలో ఎంఎస్‌ను దొంగ సూరిగాడు అంటూ పిలిచేవారు. వ్యవసాయ పనులకు వెళ్లమంటే తప్పించుకుని తిరిగేవారు. గేదెల్ని కాసేందుకు పందికోడు వంతెన గట్టుకు వెళ్లి అద్దెకు తెచ్చుకున్న నవలలను చదివేవారు.
అమ్మ పోలిక వల్లే అదృష్టం పట్టింది
తల్లి వెంకట సుబ్బమ్మ ముఖం..తనది ఒకేలా ఉంటుందని..అదే తన అదృష్టానికి కారణమని తరచూ ఎమ్మెస్ చెబుతూ మురిసిపోతుండేవాడు. ఏ కారు కొన్నా నిడమర్రు వచ్చి తల్లి వెంకట సుబ్బమ్మను తీసుకుని ద్వారకాతిరుమల తప్పని సరిగా వెళ్లేవారు. వచ్చిన ప్రతిసారి తల్లి వద్ద ఉండేందుకే సమయాన్ని కేటాయించేవారు. ఆమె 2011 సెప్టెంబర్ 25న మృతి చెందాక నిడమర్రు రావడం తగ్గించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అవకాశం దొరికితే తండ్రికి తెలియకుండా గణపవరంలో రెండో ఆట సినిమాకు వెళ్ళిన ప్రతిసారి తల్లిని అడ్డు పెట్టుకుని తండ్రి నుంచి దెబ్బలు తప్పించుకునేవారని ఆయన సోదరులు తెలిపారు.
పరుచూరి అండతో ప్రేమ వివాహం
మూర్తి రాజు కళాశాలలో భాషాప్రవీణ కోర్చు చదువుతున్నప్పుడు తోటి విద్యార్ధిని కళాప్రపూర్ణ ప్రేమలో పడ్డారు. ఇదే సమయంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. ఎమ్మెస్ ప్రేమ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కులాంతర వివాహానికి అడ్డు చెప్పారు. అవేవీ పట్టించుకోని ఎమ్మెస్ భాషా ప్రవీణ కోర్సు పూర్తి చేశాక లెక్చరర్ పరుచూరి గోపాల కృష్ణ సహకారంతో కృష్ణా జిల్లా చల్లపల్లిలో కళాప్రపూర్ణను 1972లో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఎమ్మెస్ భీమవరంలోని మూర్తిరాజు హైస్కూల్లో, భార్య కళాప్రపూర్ణ జూపూడి కేశవరావు హైస్కూల్లో సెంకడరీ గ్రేడ్ తెలుగు పండిట్‌గా చేరారు. అనంతరం భీమవరంలోని కేజీఆర్‌ఎల్ జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు.
సూర్యనారాయణ, ఆర్‌ఎంపీ
చదువు మధ్యలో మానేశాక గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడు లంకా వెంకట్రావు వద్ద సహాయకునిగా పనిచేశారు. తర్వాత కొంతకాలం గ్రామంలో ఆర్‌ఎంపీ అవతారం ఎత్తారు.
నాటకాలంటే పిచ్చి
నవలలు చదివి పాత్రల్లో లీనమైపోయేవారు. తోటి స్నేహితులతో చిన్న చిన్న నాటకాలు వేసేవారు. ఏ నాటకమైనా హాస్యభరితంగా ఉండేలా రచించేవారు. టీచరు, డాక్టర్ పాత్రల్ని ఇష్టపడేవారు. ‘చాకలి తిప్పడు’ ఏకపాత్రాభినయం ఆకట్టుకునేది. ఎక్కువగా గ్రామంలోని మంచినీటి చెరువులో ఈత కొట్టేవారు.
ప్రతి నాయకుని పాత్ర కోరిక తీరకుండానే
తెలుగు చలనచిత్ర సీమలో గుర్తుండిపోయే ప్రతి నాయకుని పాత్ర పోషించాలనేది ఎమ్మెస్ చిరకాల వాంఛ. అది నెరవేరకుండానే కన్నుమూశారు. అయిదు నందులు వచ్చిన అనందం కంటే మంచి ప్రతినాయకుని పాత్ర కోసం ఎదురు చూస్తున్నాననేవారు. హాస్యనటుడుగా రాణించడానికి కారకుడు దివంగత దర్శకుడు ఈవీవీ అని చెప్పేవారు.
పాఠాలు చెబుతూనే అందరినీ నవ్వించేవారు
మేం ఇంటర్మీడియెట్ చదివే రోజుల్లో ఎమ్మెస్ నారాయణ తెలుగు లెక్చరర్. చేతిలో పుస్తకం లేకుండానే పాఠం బోధించేవారు. తెలుగు వ్యాకరణంతోపాటు సినిమాలు, కథల చెబుతుండేవారు. పాఠానికి హాస్యాన్ని జోడించేవారు. ఒక్కోసారి డిటెక్టివ్ షాడో తరహాలో చెప్పి పాఠాన్ని రక్తికట్టించేవారు. ఆయన క్లాస్ అంటేనే పక్క గ్రూపుల విద్యార్థులు కూడా వచ్చి మావద్ద కూర్చునేవారు. గది చాలక కాలేజీ ఆవరణలోనూ నిలబడి ఆయన చెప్పే పాఠాలు వినేవారు. ‘ఎవరో మన గురించి ఏదో అనుకుంటారని మనం అనుకోకూడదు. ఎలాంటి విషమ పరిస్థితులొచ్చినా ముందుకు సాగాలి’ అని ఎమ్మెస్ నారాయణ చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే.
- బి.సాయిరమేష్, సీఐ, బొమ్మూరు పోలీస్ స్టేషన్
కలుపుగోలు మనిషి
హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కలుపుగోలు మనిషి. రంగస్థలం నుంచి వచ్చిన పేరుమోసిన రచయిత. అనవసరమైన డైలాగులు చెప్పకుండా పాత్రకు ఎంత అవసరమో అంతవరకే పరిమితమైన గొప్ప హాస్యనటుడు. తోటి హాస్యనటులను కూడా తనకంటే బాగా నటించేలా ప్రోత్సాహం అందించిన వ్యక్తి ఎమ్మెస్ నారాయణ. ఆయన మృతి తీరని లోటు. ఎంఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
- కోడి రామకృష్ణ, సినీ దర్శకుడు
మా‘స్టారు’.. వెళ్లిపోయారు
Published Sat, Jan 24 2015 10:36 AM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM
Advertisement
Advertisement