రఘువీరా.. అస్త్ర సన్యాసం!
అనంతపురం: యుద్ధభేరి మోగక ముందే సీమాంధ్ర పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి అస్త్ర సన్యాసం చేశారు. తాను ప్రాతినిథ్యం వహిస్తోన్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రఘువీరాకు ఎదురుగాలి వీస్తోంది. దీంతో పుట్టపర్తి, పెనుకొండల్లో సర్వేలు చేయించుకున్నారు. సర్వేల్లోనూ ప్రతికూలంగా ఉండటంతో సరి కొత్త వాదన అందుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పీసీసీ చీఫ్ హోదాలో రాష్ట్ర వ్యాపంగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిన పరిస్థితుల్లో తాను పోటీకి దూరం గా ఉంటానని రఘువీరా తన సన్నిహితులతో స్పష్టీకరించారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ చెవిలో శనివారం వేశారు.
దిగ్విజయ్‌కు స్పష్టం చేసిన రఘువీరా
సీమాంధ్ర పీసీసీ చీఫ్ పదవిని అనూహ్యంగా దక్కించుకున్న మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో శనివారం బాధ్యతలు స్వీకరించారు. దిగ్విజయ్‌సింగ్ నేతృత్వంలో సీమాంధ్ర పీసీసీ కాంగ్రెస్ కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాలు పూర్తయిన తర్వాత తాను ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని దిగ్విజయ్‌సింగ్‌కు రఘువీరా స్పష్టీకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సిన దృష్ట్యా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానన్న ఆయన అభిప్రాయంతో దిగ్విజయ్‌సింగ్ ఏకీభవించినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయక ముందే రఘువీరా అస్త్ర సన్యాసం చే యడంపై కాంగ్రెస్ వర్గాల్లో రసవత్తరమైన చర్చ సాగుతోంది.
పలు సర్వేల అనంతరం పోటీకి దూరంగా..
నియోజకవర్గాల పునర్విభజనలో సొంత శాసనసభ స్థానం మడకశిర ఎస్సీలకు రిజర్వు అయ్యింది. దాంతో.. 2009 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రఘువీరా వలస వెళ్లారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో టీడీపీకి కంచుకోట అయిన కళ్యాణదుర్గం నుంచి రఘువీరా ఘన విజయం సాధించారు. రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజాగ్రహం దెబ్బకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ సాహసించని దుస్థితి నెలకొంది.
రాష్ట్ర విభజన పరిణామాలకు ముందే.. సహకార, పంచాయతీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుదారులు చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే సురక్షిత స్థానం కోసం జిల్లా వ్యాప్తంగా సర్వేలు చేయించారు. పుట్టపర్తి, పెనుకొండ నియోజకవర్గాల్లో విస్తృతంగా సర్వేలు చేయించారు. అక్కడ కూడా తనకు ప్రతికూల పరిస్థితులే ఉంటాయని వెల్లడవడంతో రఘువీరా తీవ్రంగా ఆందోళన చెందుతూ వచ్చారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటం ద్వారా ఓటమిని తప్పించుకోవాలని భావిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ పదవి దక్కడంతో రఘువీరా ఊపిరిపీల్చుకున్నారు.