కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: పశు సంవర్ధక శాఖపై నాబార్డు నిధులను గుమ్మరించింది. జిల్లాలో కొత్తగా పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, నియోజకవర్గ స్థాయి శిక్షణ, విస్తరణ కేంద్రాలు ఏర్పడనున్నాయి. రెండేళ్ల క్రితం పలు గ్రామీణ పశువైద్యశాలలకు డాక్టర్ పోస్టులు మంజూరయ్యాయి. ఈ పశువైద్య శాలలను అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. రాబోయే రెండేళ్లలో జిల్లాలో పశువైద్య సేవలు మరింత విస్తరించనున్నాయి. 2009లో వచ్చిన వరదల్లో మునిగిపోయిన బహుళార్ధ పశు వైద్యశాలను ఆధునాతనంగా నిర్మించడానికి నాబార్డు రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భవన నిర్మాణానికి రూ.4 కోట్లు, ఎక్విప్‌మెంటు రూ.కోటి వినియోగిస్తారని జిల్లా పశు సంవర్ధక శాఖ జేడీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
* జిల్లా స్థాయిలో గోపాలమిత్ర శిక్షణా కేంద్రాన్ని ఇదే ప్రాంగణంలో రూ.65 లక్షలతో నిర్మించనున్నారు. ఇందులోనే రైతుల సమాచార, శిక్షణ కేంద్రాన్ని రూ.60 లక్షలతో నిర్మించనున్నారు.
* డోన్, బనగానపల్లి, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, శ్రీశైలం, ఆదోనిల్లో పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో కేంద్రాన్ని నిర్మించేందుకు రూ.23.10 లక్షలు మంజూరయ్యాయి.
* ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లి, డోన్, ఆత్మకూరు, శ్రీశైలంలలో నియోజకవర్గ స్థాయిలో రైతు శిక్షణ, విస్తరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్మాణాలకు రూ.65 లక్షల ప్రకారం నాబార్డు నిధులు విడుదల చేసింది.
* డివిజన్ స్థాయిలో కర్నూలు, నంద్యాలలో నాబార్డు నిధులతో శిక్షణా కేంద్రాలను నిర్మించనున్నారు. ఒక్కో దానికి రూ.64 లక్షలు వ్యయం చేయనున్నారు. 51 గోపాల మిత్ర సెంటర్లను నిర్మించనున్నారు. ఒక్కో దానికి రూ.7.50 లక్షలు వ్యయం చేయనున్నారు.
* యు.కొత్తపల్లి, సీతారామాపురం, పెంచికలపాడు, మాలపల్లి, వెలమకూరు, గాజులపల్లి,పి.చింతకుంట, పశువైద్య శాలలకు కాంపౌండు వాల్ నిర్మాణాలకు రూ.18 లక్షల ప్రకారం మంజూరయ్యాయి. పారుమంచాల, ప్యాలకుర్తి, కందుకూరు, కరివేన, వేంపెంట, కొరటమద్ది, జి.సింగవరం, కలుగొట్ల పశువైద్యశాలలకు డాక్టర్ పోస్టులు రెండేళ్ల క్రితం మంజూరయ్యాయి. ఇందులో ఆసుపత్రుల్లో అదనపు గది నిర్మాణం, ఎక్విప్‌మెంట్‌కు రూ.6.60 లక్షలు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ద్వారా ఈ అభివృద్ధి పనులు చేపడుతారు. జిల్లాకు పశువ్యాధి నిర్ధారణ కేంద్రాలు, శిక్షణా కేంద్రాలు మంజూరయ్యాయని, వీటి నిర్మాణానికి నాబార్డు నిధులు మంజూరు చేసిందని జేడీ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. త్వరలోనే వీటికి కొత్త పోస్టులు మంజూరవుతాయని వివరించారు.
పశుసంవర్ధక శాఖకు నాబార్డు నిధులు
Published Thu, Nov 21 2013 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement
Advertisement