అనకాపల్లి: వైద్య ఆరోగ్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు నాబార్డు నిధులు మంజూరు చేసిందని, జిల్లాకు దీనిలో 32 కోట్లు కేటాయించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. అనకాపల్లి మండలంలోని తగరంపూడి పీహెచ్‌సీ నూతన భవనాన్ని ఆదివారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖకు నాబార్డు 340 కోట్లు కేటాయించిందని, విశాఖ జిల్లాకు 32 కోట్లు కేటాయించగా, ఆ నిధుల్లో 6 కోట్లను ఎన్టీఆర్ ఆస్పత్రికి కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ నిధులే కాకుండా వైద్య ఆరోగ్య సేవల కోసం త్వరలో ఎన్‌ఆర్‌హెచ్‌ఎమ్ నిధులు విడుదల కానున్నాయన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రతి ఒక్కరూ మనదే అన్న భావన కలిగి ఉండాలన్నారు. ఆస్పత్రుల పరిసరాల్లో మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా వైద్య పోస్టులను భర్తీ చేసి వైద్యుల కొరత లేకుండా చేస్తామన్నారు. ఆస్పత్రి చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రులు కామినేని శ్రీనివాస్, విద్యామంత్రి గంటా శ్రీనివాసరావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యేలు కె.ఎస్.ఎన్. రాజు, పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్‌రాజు, డీఎంఅండ్‌హెచ్‌వో సావిత్రి, జెడ్పీటీసీ పల్లెల గంగాభవాని, ఎంపీటీసీ అప్పలరాజు, సర్పంచ్ ముమ్మన రాములమ్మ, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు నాబార్డు నిధులు
Published Mon, May 4 2015 4:54 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement