నడమంత్రపు నంబర్ ‘గేమ్’ ! | Nadamantrapu number 'game'! | Sakshi
Sakshi News home page

నడమంత్రపు నంబర్ ‘గేమ్’ !

Published Sat, Feb 22 2014 2:08 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

Nadamantrapu number 'game'!

  • రూపాయికి 64రెట్లు
  •  ఆశతో చిత్తవుతున్న పేదల జీవితాలు
  •  చల్లపల్లి కేంద్రంగానే...
  •  పట్టించుకోని పోలీసులు
  •  నంబర్లాట... ఇదో మాయా జూదం... రూపాయికి 64 రెట్ల ప్రతిఫలం...ఈ నడమంత్రపుసిరితో భాగ్యవంతులమవుదామనే అత్యాశే పేదల బతుకులను బజారున పడేస్తుంది. చల్లపల్లిలోని ఓ స్టూడియోలో పనిచేసే   వ్యక్తి ఈ  మోజులో పడి రెండు నెలల వ్యవధిలో రూ.25వేలు  పోగొట్టుకుని రోడ్డునపడ్డాడు. చల్లపల్లి-పెదకళ్లేపల్లి రోడ్డులో ఓ షాపులో పనిచేస్తున్న మరోవ్యక్తి  అప్పుల ఊబిలో కూరుకుపోయి కట్టుబట్టలతో మిగిలాడు.  ఇలా ఎంతోమంది బలవుతున్నా...పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారనే విమర్శలున్నాయి.
     
    చల్లపల్లి, న్యూస్‌లైన్ : సిక్కిం, మణిపాల్ తదితర లాటరీ  ఫలితాలు వెలువడడానికి ముందు రోజే ఈ నంబర్లాట జోరందుకుంటుంది.ఫలితం రానున్న సంఖ్యల్లోని ఏవైనా రెండంకెలు కోరుకుంటారు. పది నుంచి 99లోపు ఉన్న ఏ రెండు అంకెలనయినా కోరుకోవచ్చు. ఇలా రెండంకెలు ఎన్నయినా కట్టవచ్చు.  ఇలా అంకెలను కోరుకుని రూపాయి నుంచి వేల రూపాయలతో ఆట సాగిస్తారు. వారు కోరుకున్న అంకెలు వస్తే రూపాయికి రూ.64 ఇస్తారు. ఈ ఆశే మధ్య తరగతి ప్రజలను ఈ నంబర్లాటవైపు మళ్లేలా చేస్తోంది. ‘డబుల్‌డిజిట్ గేమ్’గా పిలిచే ఈ ఆటను ఆడేందుకు చాలా మంది ఆశపరులు ఉత్సాహం చూపుతున్నారు.
     
    చల్లపల్లి కేంద్రంగా...
     
    చల్లపల్లి, మోపిదేవి మండలాల్లోని దాదాపు 15కేంద్రాల్లో ఈ ఆట జోరుగా సాగుతున్నట్లు సమాచారం. చల్లపల్లి కేంద్రంగా ఓ వ్యక్తి ఈ కేంద్రాలన్నింటినీ పర్యవేక్షణ చేస్తుంటాడు. ఈ ఆట ద్వారా ఇప్పటికే ఆ వ్యక్తి లక్షలాది రూపాయలు వెనకేసుకున్నట్లు తెలిసింది.  పోలీసుల ఉదాసీనతను అడ్డుపెట్టుకుని మోపిదేవి మండలం వెంకటాపురంలో మూడుచోట్ల, పెదప్రోలులో ఒకటి, చల్లపల్లి పడమరవీధిలో ఒకటి, చల్లపల్లి బస్టాండు సెంటరు నుంచి లక్ష్మీపురం వరకు ఏడు, చల్లపల్లి మండలంలోని నడకుదురు, పురిటిగడ్డ, యార్లగడ్డలో ఒక్కోచోట ఈ ఆట నిర్వహించేందుకు ఏజెంట్లు  ఉన్నట్లు సమాచారం. బందరు రోడ్డులోని థియేటర్ల సెంటర్లో ఈ నంబర్లాట విచ్చలవిడిగా సాగుతోంది. పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోని బందరు రోడ్డులో ఈ ఆట జోరుగా సాగుతున్నా.... పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.  
     
    వచ్చిన లాటరీలోనూ దోపిడీ!  

     
    ఎవరైనా ఓ వ్యక్తికి అనుకోకుండా నంబరు తగిలితే అతనికి రూ.10కి 64రెట్లు.... రూ.640 ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏజెంట్లు ఇతనికి రూ.600 మాత్రమే ఇస్తూ ఇందులోనూ కమీషన్ పేరుతో దోపిడీ చేస్తున్నట్లు తెలిసింది. ప్రతి రోజూ సాయంత్రం ఆ రోజు కాసిన నంబర్ల లిస్టు అంతా చల్లపల్లిలోని ఓ వ్యక్తికి అందజేస్తుంటారు. ఆ రోజు సాయంత్రం చల్లపల్లిలోని కొన్ని ఇంటర్నెట్ సెంటర్ల వద్దకు వెళ్లి మరుసటి రోజు కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) ప్రచురితమయ్యే లాటరీ రిజల్టును తీసుకుంటారు. ఎవరికైతే వారు కట్టిన నంబర్లు వస్తాయో వారికి మరుసటి రోజు ఈ మొత్తాన్ని ఏజెంట్లు అందజేస్తారు.
     
    జోరందుకున్న నంబర్లాట...
     
    ఏడాది నుంచి అక్కడక్కడా సాగుతున్న ఈ నంబర్లాట  మూడు నెలల నుంచి మరింత జోరందుకుంది.  మధ్య తరగతి, బడుగు, బలహీన వర్గాల   రక్తాన్ని పిండుకుంటున్న ఈ నంబర్లాటపై పోలీసులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మరికొన్ని ప్రాంతాలకు ఈ నంబర్లాట విస్తరించే అవకాశం ఉంది.   మూడేళ్ల క్రితం జిల్లాస్థాయి పోలీసు అధికారి ఈ నంబర్లాటపై ఉక్కుపాదం మోపగా అప్పట్లో కనుమరుగైంది. ఏడాది నుంచి అక్కడక్కడా మొదలైన నంబర్లాట చాపకింద నీరులా నేడు చల్లపల్లి, మోపిదేవి మండలాల్లోని పలు గ్రామాలకు విస్తరించింది.   చల్లపల్లి కేంద్రంగా చుట్టు పక్కల గ్రామాల్లో ఈ నంబర్లాట జోరుగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement