లాటరీ పేరుతో నొక్కేశారు..!
- 6 కోట్ల లాటరీ తగిలిందని 35 లక్షలకు టోకరా
- బీటెక్ విద్యార్థిని మోసగించిన నైజీరియన్ల అరెస్ట్
- +44, +92 నంబర్లతో వచ్చే మెసేజ్‌లు నమ్మొద్దు: డీసీపీ
సాక్షి, హైదరాబాద్: ‘మీ సెల్ నంబర్.. లాటరీలో రూ. 6 కోట్లు గెలుచుకుంది’ అని ఓ విద్యార్థిని బురిడీ కొట్టించి.. అతని నుంచి రూ. 35 లక్షలు నొక్కేసిన నైజీరియా గ్యాంగ్ చివరికి కటకటాల పాలైంది. శనివారం సీసీఎస్ డీసీపీ పాలరాజు తన కార్యాలయంలో నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. నైజీరియాకు చెందిన పీటర్ ఆస్టిన్(29), ఎబోన్ ఫెలిక్స్ ఒమోనువా(26), స్టెఫీ ఎబోన్(24), డానియల్(26) విజిటింగ్ వీసాపై హైదరాబాద్‌కు వచ్చారు. లాటరీ పేరుతో అమాయకులను బురిడి కొట్టించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఈ క్రమంలో మాసాబ్ ట్యాంక్‌కు చెందిన విద్యార్థి మహ్మద్ వసీముద్దీన్ (22)కు ‘‘మీ సెల్‌నంబర్ లాటరీలో రూ. 6 కోట్లు గెలుచుకుంది’’ అని ఈ-మెయిల్ వచ్చింది. దీంతో వసీముద్దీన్ రూ. 6 కోట్లు ఎలా వస్తాయి.. ఎప్పుడు పంపిస్తారని తిరిగి మెయిల్ పంపాడు. ముందుగా రిజిస్ట్రేషన్ చార్జీలు, ట్యాక్స్, కస్టమ్స్ క్లియరెన్స్ ఛార్జీలు, హైకోర్టు సర్టిఫికెట్, ఫైనాన్స్ మినిస్ట్రీ ఎన్‌వోసీ, బాంబే హైకోర్టు అఫిడవిట్, ఆర్‌బీఐ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని వసీముద్దీన్‌ను వారు నమ్మించారు.
దీంతో వారు చెప్పినట్లు 16 బ్యాంకు ఖాతాల్లో రూ.35 లక్షలు డబ్బులను వసీముద్దీన్ వేశాడు. కానీ, రూ.6 కోట్లు రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన వసీముద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శనివారం నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 4 లక్షల నగదు, కారు స్వాధీనం చేసుకున్నామని పాలరాజు చెప్పారు. లాటరీ గెలిచారని +44, +92 సిరీస్ నంబర్లతో వచ్చె ఎస్‌ఎంఎస్‌లను నమ్మొద్దని ప్రజలకు సూచించారు.