Manipal
-
ఆకాసాలో భారీ పెట్టుబడులకు చర్చలు
ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఆకాసా ఎయిర్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. రెండు సంస్థలు కలిపి రూ.1,049 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.భారత్‌లో విమానయాన ప్రయాణికులు పెరుగుతున్నారు. దాంతో చాలా కంపెనీలు దేశీయ రూట్లలో విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో టైర్1, 2, 3 సిటీల్లోని ప్రజలు విమానాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతారని అంచనా వేస్తున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణాలకు అనువైన మౌలికవసతులను అభివృద్ధి చేస్తున్నాయి. దీన్ని గమనించిన కొన్ని సంస్థలు విమానయాన కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే రూ.2,938 కోట్లు విలువైన ఆకాసా ఎయిర్‌లో తాజాగా అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం కన్సార్టియంగా ఉన్న ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, మణిపాల్ గ్రూప్‌కు చెందిన రంజన్‌పాయ్ ఆధ్వర్యంలోని క్లేపాండ్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఫలితంగా ఆకాసా ఎయిర్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ప్రైవేట్ బ్యాంకుల్లో తగ్గుతున్న ‘అట్రిషన్’ఇదిలాఉండగా, ఇప్పటికే ఆ కంపెనీలో రాకేష్జున్జున్వాలా కుటుంబానికి గరిష్ఠంగా రూ.293 కోట్ల వాటా ఉంది. ఇప్పుడు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ కలిపి దాదాపు రూ.1,049 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇదే జరిగితే ఆకాసాలో మేజర్ వాటాదారులుగా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ వ్యవహరిస్తాయి. ఆకాసాలో ప్రస్తుతం 24 ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. 202 విమానాలను ఆర్డర్ చేశారు. 27 నగరాలకు ప్రయాణికులను చేరవేస్తున్నారు. -
మణిపాల్‌సిగ్నాకు కీలక మార్కెట్లుగా తెలుగు రాష్ట్రాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమకు కీలక మార్కెట్లుగా మారాయని మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సప్న దేశాయ్ తెలిపారు. 2022–23లో రెండు రాష్ట్రాల్లో రూ. 150 కోట్ల పైచిలుకు స్థూల ప్రీమియం (జీడబ్ల్యూపీ) వచి్చందని, దక్షిణాదిలో తమకు రెండో అతి పెద్ద మార్కెట్‌గా ఈ ప్రాంతం నిలి్చందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా తమ ఆరోగ్య బీమా వ్యాపారాన్ని మరింతగా విస్తరించనున్నట్లు వివరించారు. తమ లైఫ్‌టైమ్ హెల్త్, ప్రైమ్ సీనియర్ పథకాలకు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తోందన్నారు. 2022–23లో దక్షిణాది మార్కెట్లో తమ జీడబ్ల్యూపీ 37 శాతం పెరిగి రూ. 500 కోట్లకు చేరినట్లు చెప్పారు. వచ్చే రెండేళ్లలో దీన్ని రూ. 1,000 కోట్లకు పెంచుకోనున్నట్లు, కొత్త శాఖలను ప్రారంభించడంతో పాటు 10,000 మంది పైచిలుకు ఏజెంట్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు సప్న వివరించారు. లైఫ్‌టైమ్ హెల్త్ ప్లాన్ కింద మణిపాల్‌సిగ్నా రూ. 50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు కవరేజీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్ కోసం ఉద్దేశించిన ప్రైమ్ సీనియర్ కింద 91 రోజుల తర్వాత నుంచే ప్రీ–ఎగ్జిస్టింగ్ వ్యాధులకు కూడా కవరేజీ ఇస్తోంది. -
నాడు అద్దె ఇల్లు.. నేడు 6 యూనివర్సిటీలు, 28 ఆస్పత్రులు
ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ న్యూయార్క్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ డేవిడ్సన్ కెంప్నర్ క్యాపిటల్ మేనేజ్మెంట్తో కొనసాగుతున్న రుణ వివాదానికి పరిష్కారం అంచున ఉంది. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ చైర్మన్ రంజన్ పాయ్ బైజూస్‌లో దాదాపు రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో డేవిడ్సన్ కెంప్నర్ నుంచి బైజూస్ తీసుకున్న రూ.800 కోట్ల రుణాన్ని సెటిల్ చేసేందుకు రంజన్ పాయ్ రూ.1,400 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎవరీ డాక్టర్ రంజన్ పాయ్.. ఆయన బిజినెస్.. నెట్‌వర్త్ వంటి విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎవరీ డాక్టర్ రంజన్ పాయ్? 1972 నవంబర్ 11న జన్మించిన డాక్టర్ రంజన్ పాయ్ ఒక అర్హత కలిగిన వైద్యుడు, వ్యాపారవేత్త. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ (MEMG) ఛైర్మన్. ఈ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఆరు విశ్వవిద్యాలయాలు, 28 ఆసుపత్రులను నడుపుతోంది. రంజన్ పాయ్ తండ్రి పద్మభూషణ్ అవార్డు గ్రహీత రాందాస్ పాయ్. మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE)కి రాందాస్ పాయ్ ఛాన్సలర్‌గా ఉన్నారు. రంజన్ పాయ్ మణిపాల్‌లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసి, యూఎస్ వెళ్లి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఫెలోషిప్ పూర్తి చేశారు. అద్దె ఇంట్లో ప్రారంభం డాక్టర్ రంజన్ పాయ్ మలేషియాలోని మెలక మణిపాల్ మెడికల్ కాలేజీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో రంజన్ పాయ్ బెంగళూరులోని అద్దె ఇంట్లో మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్‌ను ప్రారంభించారు. కేవలం 2 లక్షల డాలర్లతో వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు దీని విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 25,000 కోట్లు). నెట్‌వర్త్ ఫోర్బ్స్ ప్రకారం డాక్టర్ రంజన్ పాయ్ నెట్‌వర్త్ 2.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 23,000 కోట్లు). మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌కు ఇప్పుడు మలేషియా, ఆంటిగ్వా, దుబాయ్, నేపాల్ దేశాల్లో కూడా క్యాంపస్‌లు ఉన్నాయి. ఇదే కాకుండా డాక్టర్ రంజేన్ పాయ్కి మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ అనే సంస్థ కూడా ఉంది. -
సీనియర్ సిటిజన్స్ కోసం కొత్త పాలసీ.. ప్రయోజనాలు ఇవే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీనియర్ సిటిజన్స్ కోసం మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ తాజాగా ప్రైమ్ సీనియర్ పేరిట ఆరోగ్య బీమా పథకం ప్రవేశపెట్టింది. తక్కువ వెయిటింగ్ పీరియడ్, పాలసీ తీసుకున్న 91వ రోజు నుంచీ ప్రీ–ఎగ్జిస్టింగ్ (అప్పటికే ఉన్న) అనారోగ్య సమస్యలకు కవరేజీ మొదలైన ప్రత్యేకతలు ఈ పాలసీలో ఉన్నట్లు సంస్థ ఎండీ ప్రసూన్ సిక్దర్ తెలిపారు. కో–పే, ఉప–పరిమితులు, పాలసీ తీసుకునే ముందు తప్పనిసరి మెడికల్ చెకప్ వంటి బాదరబందీలేమీ ఇందులో ఉండవని వివరించారు. నాన్–మెడికల్ ఐటమ్లకు కూడా కవరేజీ లభిస్తుందని, అపరిమిత టెలీ కన్సల్టేషన్, హెల్త్ చెకప్‌లు వంటి ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఇది ప్రైమ్ సీనియర్ క్లాసిక్, ప్రైమ్ సీనియర్ ఎలీట్ అని రెండు వేరియంట్లలో ఉంటుందని వివరించారు. (ఇదీ చదవండి: ట్రాయ్ నిబంధనలు కఠినతరం! కాల్ సేవల నాణ్యత మెరుగుపడేనా?) -
కడుపునిండా తినండి బాబూ!
రెస్టారెంట్, ఫుడ్ కోర్టులలో కడుపునిండా భోంచేయాలంటే .. కనీసం రూ.200 పైనే వెచ్చించాల్సి ఉంటుంది. వివిధ వెరైటీ రుచులతో పుల్‌మీల్స్ ప్లేట్ తీసుకుంటే... హోటల్ ఉన్న ప్రాంతం, దానికి ఉన్న పాపులారిటిని బట్టి ప్లేటు రేటు ఉంటుంది. కొన్ని సార్లు పేరున్న రెస్టారెంట్లలో తిన్నప్పటికీ, భోజనం అంతరుచిగా ఉండదు. ఇలాంటి హోటల్స్ ఉన్న ఈ రోజుల్లో తిన్నంత అన్నం, ఐదారు రకాల కూరలతో కడుపునిండా పెడుతున్నారు. ఎంతో రుచికరమైన భోజనం పెడుతూ నామమాత్రము ధర రూ.50 ఫుల్‌మీల్స్ అందిస్తున్నారు ఓ జంట. ఇంత తక్కువకు భోజనం పెడుతున్నారంటే ఏదో చారిటీ సంస్థో అనుకుంటే పొరపడినట్లే. ఒంట్లో జవసత్వాలు నీరసించినప్పటికీ కొన్నేళ్లుగా ఎంతో ప్రేమగా వండి వారుస్తూ వేలమంది మన్ననలు పొందుతున్నారు ఈ అజ్జా అజ్టీలు. కర్ణాటకలోని మణిపాల్‌కు చెందిన వృద్ధ దంపతులే అజ్జా అజ్టీలు. రాజగోపాల్ నగర్ రోడ్‌లోని హోటల్ గణేష్ ప్రసాద్ (అజ్జా అజ్జీ మానే)ను 1951 నుంచి ఈ దంపతులు నడుపుతున్నారు. శాకాహార భోజనాన్ని అరిటాకు వేసి వడ్డించడాన్ని గత కొన్నేళ్లుగా సంప్రదాయంగా పాటిస్తున్నారు. అరిటాకు వేసి అన్నం, పప్పు, వేపుడు కూరలు, పచ్చడి, సలాడ్, రసం, పెరుగు పెడతారు. ఇవన్నీ బయట హోటల్లో తినాలంటే కనీసం రెండువందల రూపాయలైనా చెల్లించాలి. కానీ వీరు కేవలం యాభైరూపాయలకే భోజనం పెడుతూ కడుపు నింపుతున్నారు. ఇక్కడ పెట్టే భోజనం రుచిగా, శుచిగా ఉండడంతో కస్టమర్లు ఎగబడి ఇష్టంగా తింటున్నారు. ఇంట్లో వండిన వంట, తక్కువ రేటు, ప్రేమగా వడ్డిస్తుండడంతో ఈ హోటల్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. స్థానికంగా అంతా అజ్జాఅజ్జీ మానే అని పిలుచుకుంటుంటారు. వయసులో పెద్ద వాళ్లు కావడంతో కస్టమర్లకు ఆ దంపతులు తల్లిదండ్రులుగా, బామ్మ తాతయ్యలు వండిపెట్టినట్లుగా భావించి ఎంతో ఇష్టంగా తింటున్నారు. ప్రస్తుతం నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ వారు అనుకున్న దానిని కొనసాగిస్తున్నారు. ఈ దంపతుల గురించి ఇటీవల రక్షిత్ రాయ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అజ్జాఅజ్జీలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నారు. వీరి సేవాగుణం గురించి తెలిసిన నెటిజన్లు వీరిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. -
ట్రాలీ బ్యాగులో ప్రేయసిని కుక్కేసి.. అడ్డంగా దొరికిపోయాడు
ప్రేయసితో తన గదిలో రాత్రంతా సరదాగా గడపాలన్న ఓ కుర్రాడి ప్రయత్నం బెడిసి కొట్టింది. మాస్టర్ ప్లాన్ వేసి గర్ల్‌ఫ్రెండ్‌ను రూమ్‌కి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కాస్తుంటే.. గదికి చేరుకునేవాడే. ఇంతలో.. కర్ణాటక మణిపాల్ హాస్టల్లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి.. అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆమెను తన గదికి తీసుకెళ్లాలని ప్లాన్ వేశాడు. ఓ పెద్ద ట్రాలీ బ్యాగులో ఆమెను కుక్కేసి.. హాస్టల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏం ఎరగనట్లు వెళ్తున్న అతనిపై హాస్టల్ వార్డెన్‌కు అనుమానం వచ్చింది. అంతపెద్ద లగేజ్ ఏంటని ప్రశ్నించాడు. దీంతో ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులు అంకుల్.. అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చాడు ఆ కుర్రాడు.దాంతో ఆ వార్డెన్ అనుమానం మరింత బలపడింది. బ్యాగ్ ఓపెన్ చేయాలని కోరడంతో.. పగిలిపోయే ఐటెమ్స్ ఉన్నాయని, వద్దని రిక్వెస్ట్ చేశాడు. అయినా కుదరదని బలవంతంగా ఆ ట్రాలీ బ్యాగ్ జిప్ ఓపెన్ చేయడంతో.. అందులోంచి ఆ కుర్రాడి గర్ల్‌ఫ్రెండ్ బయటకు వచ్చింది. ఆపై గట్టిగా ప్రశ్నించడంతో హాస్టల్లో గడిపేందుకు తీసుకొచ్చానని నిజం ఒప్పుకున్నాడు. ఈ ఇద్దరూ ఒకే కాలేజ్ స్టూడెంట్స్ కావడంతో సస్పెండ్ చేసి..ఇళ్లకు పంపించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ టైంలో మంగళూరుకు చెందిన ఓ స్టూడెంట్.. తన ఫ్రెండ్‌ను ఇదే తరహాలో అపార్ట్‌మెంట్‌కు తెచ్చుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో మణిపాల్‌కు సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది Manipal Academy of Higher Education. The funniest video I've seen today 😬 Apparently, a Manipal Univ. student was smuggling his gf out in a trolley bag. Someone's watching too much Netflix. pic.twitter.com/RQLkAfj9vB — 𝙋𝙧𝙚𝙧𝙣𝙖 𝙇𝙞𝙙𝙝𝙤𝙤 (@PLidhoo) February 2, 2022 -
కరెన్సీ గణేష్.. ఖతర్నాక్ ఉన్నాడు
బెంగళూరు : ఎక్కడైనా మట్టి, పీఓపీలతో వినాయక విగ్రహాలను తయారు చేయడం చూశాం. అయితే మణిపాల్‌కు చెందిన స్కాండ్ కళకారుడు శ్రీనాథ్ మణిపాల, వెంకి పలిమారు, రవి హిరేబెట్టులు 21 దేశాల కరెన్సీ నోట్లతో వినాయక ప్రతిమ తయారు చేశారు. ఉడిపిలోని విద్యా సముద్ర రోడ్డులోని సాయిరాధ మోటార్స్ సంస్థలో ఆ సంస్థ సహకారంతో ఈ కరెన్సీ విగ్రహాన్ని రూపొందించారు. శ్రీలంక, బంగ్లా దేశ్, చైనా, భూటాన్, అప్ఘానిస్థాన్, బహరైన్, యుఏఇ, అమెరికా తదితర 21 దేశాల కరెన్సీ నోట్లను విగ్రహం తయారీలో ఉపయోగించారు. -
ఐటీలో 5 లక్షల కొలువులు
హైదరాబాద్: దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసుల రంగం, స్టార్టప్‌లు వచ్చే ఏడాది భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనున్నాయి. 2019లో దాదాపు 5 లక్షల మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ తెలియజేశారు. ఫ్రెషర్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారాయన. దాదాపు ఏడేళ్ల పాటు స్థిరంగా ఉండిపోయిన ఎంట్రీ స్థాయి ఉద్యోగుల జీతభత్యాల ప్యాకేజీలు గతేడాది సుమారు 20 శాతం మేర పెరిగాయని తెలిపారు. 2018 సమీక్ష, 2019 అంచనాల మీద మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘2018లో హెచ్1బీ వీసాల నిబంధనలు కఠినతరమయ్యాయి. దీంతో భారత ఐటీ కంపెనీలు జపాన్, ఆగ్నేయాసియా దేశాలపై మరింత దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ సేవల రంగం మళ్లీ వృద్ధి బాట పడుతోంది. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ మంత్రి కేటీఆర్ మార్కెటింగ్ నైపుణ్యాలతో మరిన్ని కొత్త కంపెనీలు హైదరాబాద్‌కి వస్తున్నాయి. హైదరాబాద్ హాట్ డెస్టినేషన్‌గా మారింది‘ అని పాయ్ పేర్కొన్నారు. స్టార్టప్‌లలో 2 లక్షల ఉద్యోగాలు.. దేశీ స్టార్టప్ సంస్థలు వచ్చే ఏడాది సుమారు 2,00,000 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని పాయ్ తెలిపారు. స్టార్టప్స్ గతేడాది 1,50,000 మందిని నియమించుకున్నాయని.. ప్రస్తుతం వీటిల్లో ఉద్యోగుల సంఖ్య 6,00,000 పైచిలుకు ఉంటుందని ఆయన తెలిపారు. ఐటీ సర్వీసులు, స్టార్టప్స్ కలిస్తే 4.5 లక్షలు – 5 లక్షల దాకా నియామకాలు ఉండొచ్చన్నారు. 2018లో ఇవి రెండూ కలిపి సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది దాకా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నట్లు వివరించారు. ‘స్టార్టప్‌లు కూడా పెద్ద కంపెనీలుగా ఎదుగుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 39,000 పైచిలుకు స్టార్టప్స్ ఉన్నాయి. ప్రతీ సంవత్సరం కొత్తగా 5,000 ఏర్పడుతున్నాయి. ఇవి హైరింగ్ చేపట్టినప్పుడు ఇంజనీర్లే కాకుండా వివిధ రకాల ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. ఆ రకంగా వీటిల్లోనూ ఉద్యోగావకాశాలు గణనీయంగా ఉన్నాయి‘ అని పాయ్ తెలిపారు. ఎంట్రీ లెవల్లో రూ.5 లక్షలు? ఐటీ సేవల సంస్థల్లో ఉద్యోగులు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందుతుండటం రెట్టింపు స్థాయిలో జరుగుతోందని, ఐటీ కంపెనీల్లో డిజిటల్ విభాగాల ఆదాయాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతోందని పాయ్ చెప్పారు. ‘‘ఫ్రెషర్స్ జీతభత్యాల ప్యాకేజీ చాలా కాలం తర్వాత 20 శాతం మేర పెరగడం మంచి పరిణామం. మరింత సుశిక్షితులైన నిపుణులను ఆకర్షించేందుకు కంపెనీలు మరింత ఎక్కువ జీతభత్యాలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఎంట్రీ లెవెల్ ప్యాకేజీలు ప్రస్తుతం వార్షికంగా రూ. 4.5–5 లక్షల దాకా ఉంటున్నాయి. నిజానికి చాలా కాలం పాటు ఎంట్రీ లెవెల్లో జీతాలు పెరగకుండా స్థిరంగా ఉండిపోయాయి. దీంతో ఉద్యోగులు నిరాశలో మునిగారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పోలిస్తే పెద్ద నగరాల్లో డెలివరీ బాయ్స్ కూడా నెలకు రూ.50,000 సంపాదిస్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం‘ అని పాయ్ వ్యాఖ్యానించారు. -
ఫోర్టిస్‌కు మరింత మెరుగైన మణిపాల్ ఆఫర్
న్యూఢిల్లీ: ఫోర్టిస్ హెల్త్‌కేర్ కొనుగోలు ప్రక్రియలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మణిపాల్–టీపీజీ కన్సార్షియమ్ మరింత ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఒక్కో షేర్‌ను రూ.180కి కొనుగోలు చేస్తామని ఈ కన్సార్షియమ్ ముందుకు వచ్చిందని ఫోర్టిస్ హెల్త్‌కేర్ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు నివేదించింది. ముంజాల్–బర్మన్ల ఆఫర్‌కు ఫోర్టిస్ హెల్త్‌కేర్ డైరెక్టర్ల బోర్డ్ గత వారం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. స్వతంత్ర మదింపు సంస్థ ఒకటి ఫోర్టిస్ హెల్త్‌కేర్ విలువను రూ.6,070 కోట్లుగా అంచనా వేసిందని, కానీ తాము ఒక్కో షేర్‌కు రూ.180 ఆఫర్ చేస్తున్నామని, ఈ ధర ప్రకారం ఫోర్టిస్ హెల్త్‌కేర్ విలువ రూ.9,403 కోట్లవుతుందని మణిపాల్–టీపీజీ కన్సార్షియమ్ ఫోర్టిస్ డైరెక్టర్ల బోర్డ్‌కు రాసిన ఒక లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్ 0.2 శాతం లాభంతో రూ. 149 వద్ద ముగిసింది. -
వాటాదారులే తేల్చాలి..!
న్యూఢిల్లీ: హీరో–బర్మన్ల ఆఫర్‌కు ఫోర్టిస్ హెల్త్‌కేర్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలపడం పట్ల ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్, మణిపాల్–టీపీజీ కన్సార్షియమ్లు నిరాశను వ్యక్తం చేశాయి. ఫోర్టిస్ హెల్త్‌కేర్ వాటాదారులతోనే నేరుగా మాట్లాడాలని యోచిస్తున్న మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ భవిష్యత్తు కార్యాచరణ పట్ల కసరత్తు చేస్తోంది. తమ ఆఫర్ ఉత్తమమైనదని ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ ఎమ్డీ, సీఈఓ ట్యాన్ సీ లెంగ్ వ్యాఖ్యానించారు. ఫోర్టిస్ స్వల్పకాల రుణ అవసరాలను తీర్చడమే కాకుండా కంపెనీ దీర్ఘకాల లక్ష్యాల విషయంలో కూడా తమ ఆఫరే ఉత్తమమైనదని వివరించారు. ఫోర్టిస్ వాటాదారులు నిర్ణయం తీసుకునే ముందు బోర్డ్ ప్రతిపాదనను క్షుణ్నంగా సమీక్షిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు ఫోర్టిస్ ప్రతిపాదనను అంగీకరించాలో, వద్దో అన్న నిర్ణయాన్ని వాటాదారులు నిర్ణయించాలని మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ ఎమ్డీ, సీఈఓ రంజన్ పాయ్ వ్యాఖ్యానించారు. -
గాలివానొచ్చే..సర్వ నాశానం చేసే
-
ఆరోగ్య రాజధానిగా విశాఖ
మంత్రి కామినేని శ్రీనివాసరావు మణిపాల్‌లో ఫీటల్ మెడిసిన్ ప్రారంభం విశాఖ మెడికల్: విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగానే కాకుండా ఆరోగ్య రాజధానిగా తీర్చిదిద్దనున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు తెలిపారు. జగదాంబ జంక్షన్‌లోని మణిపాల్ తల్లి, పిల్లల ఆస్పత్రిలో బుధవారం ఫీటల్ మెడిసిన్, నవజాత నిశిత శిశు చికిత్సా(ఎన్ఐసీయూ) విభాగాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల వైద్య కేంద్రంగా విరాజిల్లుతోందని, భవిష్యత్‌లో మరిన్ని అధునాతన వైద్య సదుపాయాలను తీసుకురావడం ద్వారా దీనిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఒడిశా, చత్తీస్ఘడ్, ఉత్తరాఖండ్ రాష్టాల సరిహద్దు జిల్లాల నుంచి నిత్యం వందలాది మంది రోగులు విశాఖ నగరానికి వైద్యం కోసం వస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ వైద్య రంగంలో ప్రత్యేక వైద్య సదుపాయాలు నగరంలో అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. విశాఖలో తొలిసారిగా మణిపాల్ తల్లి,పిల్ల ఆస్పత్రిలో ప్రత్యేక వైద్య విభాగమైన ఫీటల్ మెడిసిన్ ప్రారంభించడం ఆనందదాయకమన్నారు. మణిపాల్ ఆస్పత్రి సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ అజయ్‌భక్షి మాట్లాడుతూ నగరంలో తొలిసారిగా మణిపాల్ ఆస్పత్రి అధునాతన నవజాత శిశు ైవె ద్య సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. 2007లోనే నవజాత శిశు వైద్యంలో లెవల్-3 చికిత్స సదుపాయాలను మణిపాల్ ఆస్పత్రి నగరానికి పరిచయం చేసిందన్నారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఫీటల్ మెడిసిన్ చికిత్స పుస్తకాన్ని మంత్రితో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఆస్పత్రి ఫీటల్ మెడిసిన్ అధిపతి డాక్టర్ ఎం.మాధురి, నవజాత శిశు వైద్య నిపుణుడు డాక్టర్ సునీల్‌కిషోర్, పిల్లల వైద్యురాలు డాక్టర్ అమితా త్రిపాఠి, జి.రాము, మణిపాల్ గ్రూప్ దక్షిణ భారత సీఓఓ గౌరవ్ రేఖి తదితరులు పాల్గొన్నారు. -
నింగిన ఎగిసిన విజ్ఞాన కెరటం
‘జ్ఞాన పీఠ్’ అనంతమూర్తి కన్నుమూత అనారోగ్యంతో ‘మణిపాల్’లో చికిత్స గుండెపోటుతో మృతి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కన్నడ సాహితీ దిగ్గజం, జ్ఞాన పీఠ్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ యూఆర్. అనంతమూర్తి (81) శుక్రవారం సాయంత్రం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. దీర్ఘ కాలంగా ఆయన మూత్ర పిండాల వైఫల్యంతో బాధ పడుతున్నారు. ఇంటిలోనే డయాలసిస్ చేసుకునే వారు. వారం కిందట ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆస్పత్రిలో చేరారు. అత్యవసర చికిత్సా విభాగం (ఐసీయూ)లో ఆయనకు వైద్య సేవలు అందిస్తుండగా హఠాత్తుగా గుండె పోటు రావడంతో కన్ను మూశారు. ఉదయం నుంచే ఆయన ఆరోగ్యం విషమించిందని, కృత్రిమ శ్వాసను అందించడం ద్వారా ఆయన ప్రాణాలను కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని మణిపాల్ ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ సుదర్శన్ బల్లాల్ వెల్లడించారు. మధ్నాహ్నం 12.30 గంటలకు ఆయన అత్యవసరంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బహుళ వ్యవస్థలను కల్పించడం ద్వారా ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. మూత్ర పిండాల వైఫల్యంతో బాధ పడుతున్నప్పటికీ అనంత మూర్తి విస్తృతంగా ప్రయాణాలు చేసేవారని, దీని వల్ల గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. ఆరు నుంచి ఎనిమిది మంది వైద్యులతో కూడిన బృందం ఆయన ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షించిందని తెలిపారు. అభ్యుదయ భావజాలం శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా మేలిగె గ్రామంలో 1932 డిసెంబరు 21న ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తి జన్మించారు. ఇప్పటి వరకు కర్ణాటకలో ఎనిమిది మందికి జ్ఞాన పీఠ్ పురస్కారాలు లభించగా, అనంతమూర్తి ఆరో వారు. తన సాహితీ సేవలకు గుర్తింపుగా 1994లో ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. పద్మ భూషణ్ అవార్డు కూడా ఆయనను వరించింది. 2013లో మ్యాన్ బుకర్ ప్రైజ్‌కు ఆయన ఫైనలిస్టు కూడా. 1965లో రాసిన ‘సంస్కార’ నవలతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. అణువణువునా అభ్యుదయ భావజాలం కలిగిన అనంతమూర్తి రాసిన ఆ నవల వెండి తెరకెక్కి, దేశంలో సినిమా దిశనే మార్చివేసింది. ‘ఘటశ్రద్ధ’, ‘భారతీపుర’, ‘అవస్థే’, ‘భావ’ అనే రచనలు ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి. ఈ ఏడాదిలో జరిగిన లోక్‌సభ ఎన్నికలప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. నరేంద్ర మోడీ ఎన్నికలలో గెలుపొంది, ప్రధాని అయితే తాను ఈ దేశాన్ని విడిచి పోతానని ప్రకటించారు. అనంతరం తన వైఖరిని మార్చుకుని, భావోద్వేగానికి గురై ఆ ప్రకటన చేశానని వివరణ ఇచ్చారు. మోడీ ప్రధాని పదవి చేపట్టాక మంగళూరు నుంచి కొందరు ఆకతాయిలు పాకిస్తాన్‌కు వెళ్లేందుకు ఆయనకు విమాన టికెట్‌ను పంపిన వైనం విదితమే. -
నడమంత్రపు నంబర్ ‘గేమ్’ !
రూపాయికి 64రెట్లు ఆశతో చిత్తవుతున్న పేదల జీవితాలు చల్లపల్లి కేంద్రంగానే... పట్టించుకోని పోలీసులు నంబర్లాట... ఇదో మాయా జూదం... రూపాయికి 64 రెట్ల ప్రతిఫలం...ఈ నడమంత్రపుసిరితో భాగ్యవంతులమవుదామనే అత్యాశే పేదల బతుకులను బజారున పడేస్తుంది. చల్లపల్లిలోని ఓ స్టూడియోలో పనిచేసే వ్యక్తి ఈ మోజులో పడి రెండు నెలల వ్యవధిలో రూ.25వేలు పోగొట్టుకుని రోడ్డునపడ్డాడు. చల్లపల్లి-పెదకళ్లేపల్లి రోడ్డులో ఓ షాపులో పనిచేస్తున్న మరోవ్యక్తి అప్పుల ఊబిలో కూరుకుపోయి కట్టుబట్టలతో మిగిలాడు. ఇలా ఎంతోమంది బలవుతున్నా...పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారనే విమర్శలున్నాయి. చల్లపల్లి, న్యూస్‌లైన్ : సిక్కిం, మణిపాల్ తదితర లాటరీ ఫలితాలు వెలువడడానికి ముందు రోజే ఈ నంబర్లాట జోరందుకుంటుంది.ఫలితం రానున్న సంఖ్యల్లోని ఏవైనా రెండంకెలు కోరుకుంటారు. పది నుంచి 99లోపు ఉన్న ఏ రెండు అంకెలనయినా కోరుకోవచ్చు. ఇలా రెండంకెలు ఎన్నయినా కట్టవచ్చు. ఇలా అంకెలను కోరుకుని రూపాయి నుంచి వేల రూపాయలతో ఆట సాగిస్తారు. వారు కోరుకున్న అంకెలు వస్తే రూపాయికి రూ.64 ఇస్తారు. ఈ ఆశే మధ్య తరగతి ప్రజలను ఈ నంబర్లాటవైపు మళ్లేలా చేస్తోంది. ‘డబుల్డిజిట్ గేమ్’గా పిలిచే ఈ ఆటను ఆడేందుకు చాలా మంది ఆశపరులు ఉత్సాహం చూపుతున్నారు. చల్లపల్లి కేంద్రంగా... చల్లపల్లి, మోపిదేవి మండలాల్లోని దాదాపు 15కేంద్రాల్లో ఈ ఆట జోరుగా సాగుతున్నట్లు సమాచారం. చల్లపల్లి కేంద్రంగా ఓ వ్యక్తి ఈ కేంద్రాలన్నింటినీ పర్యవేక్షణ చేస్తుంటాడు. ఈ ఆట ద్వారా ఇప్పటికే ఆ వ్యక్తి లక్షలాది రూపాయలు వెనకేసుకున్నట్లు తెలిసింది. పోలీసుల ఉదాసీనతను అడ్డుపెట్టుకుని మోపిదేవి మండలం వెంకటాపురంలో మూడుచోట్ల, పెదప్రోలులో ఒకటి, చల్లపల్లి పడమరవీధిలో ఒకటి, చల్లపల్లి బస్టాండు సెంటరు నుంచి లక్ష్మీపురం వరకు ఏడు, చల్లపల్లి మండలంలోని నడకుదురు, పురిటిగడ్డ, యార్లగడ్డలో ఒక్కోచోట ఈ ఆట నిర్వహించేందుకు ఏజెంట్లు ఉన్నట్లు సమాచారం. బందరు రోడ్డులోని థియేటర్ల సెంటర్లో ఈ నంబర్లాట విచ్చలవిడిగా సాగుతోంది. పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోని బందరు రోడ్డులో ఈ ఆట జోరుగా సాగుతున్నా.... పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. వచ్చిన లాటరీలోనూ దోపిడీ! ఎవరైనా ఓ వ్యక్తికి అనుకోకుండా నంబరు తగిలితే అతనికి రూ.10కి 64రెట్లు.... రూ.640 ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏజెంట్లు ఇతనికి రూ.600 మాత్రమే ఇస్తూ ఇందులోనూ కమీషన్ పేరుతో దోపిడీ చేస్తున్నట్లు తెలిసింది. ప్రతి రోజూ సాయంత్రం ఆ రోజు కాసిన నంబర్ల లిస్టు అంతా చల్లపల్లిలోని ఓ వ్యక్తికి అందజేస్తుంటారు. ఆ రోజు సాయంత్రం చల్లపల్లిలోని కొన్ని ఇంటర్నెట్ సెంటర్ల వద్దకు వెళ్లి మరుసటి రోజు కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) ప్రచురితమయ్యే లాటరీ రిజల్టును తీసుకుంటారు. ఎవరికైతే వారు కట్టిన నంబర్లు వస్తాయో వారికి మరుసటి రోజు ఈ మొత్తాన్ని ఏజెంట్లు అందజేస్తారు. జోరందుకున్న నంబర్లాట... ఏడాది నుంచి అక్కడక్కడా సాగుతున్న ఈ నంబర్లాట మూడు నెలల నుంచి మరింత జోరందుకుంది. మధ్య తరగతి, బడుగు, బలహీన వర్గాల రక్తాన్ని పిండుకుంటున్న ఈ నంబర్లాటపై పోలీసులు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మరికొన్ని ప్రాంతాలకు ఈ నంబర్లాట విస్తరించే అవకాశం ఉంది. మూడేళ్ల క్రితం జిల్లాస్థాయి పోలీసు అధికారి ఈ నంబర్లాటపై ఉక్కుపాదం మోపగా అప్పట్లో కనుమరుగైంది. ఏడాది నుంచి అక్కడక్కడా మొదలైన నంబర్లాట చాపకింద నీరులా నేడు చల్లపల్లి, మోపిదేవి మండలాల్లోని పలు గ్రామాలకు విస్తరించింది. చల్లపల్లి కేంద్రంగా చుట్టు పక్కల గ్రామాల్లో ఈ నంబర్లాట జోరుగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.