
రెండో రోజూ నన్నపనేని దీక్ష
టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల సంఘీభావం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టవద్దన్న డిమాండ్‌తో టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి చేపట్టిన 48 గంటల దీక్ష బుధవారం రెండో రోజు శాసనమండలి ఆవరణలో కొనసాగింది. మంగళవారం అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో దీక్ష మొదలుపెట్టిన ఆమెను రాత్రికి పోలీసులు బలవంతంగా ఇంటికి తరలించినప్పటికీ, తిరిగి బుధవారం ఉదయం టీడీఎల్పీ కార్యాలయంలో దీక్షకు కూర్చున్నారు. దీక్ష స్థలం నుంచే మండలి సమావేశాలకు హాజరయ్యారు.
సభ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాయిదాపడడంతో మీడియాపాయింట్‌కు వచ్చి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో కేంద్రం వైఖరిని తప్పుపట్టారు. తర్వాత తిరిగి మండలి ప్రవేశ ద్వారం దగ్గర దీక్ష మొదలుపెట్టారు. దీక్షకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు జూపూడి ప్రభాకరరావు, ఆదిరెడ్డి అప్పారావు, నారాయణరెడ్డి, తిప్పారెడ్డి సంఘీభావం తెలిపారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నన్నపనేనికి మద్దతుగా కొద్దిసేపు దీక్షలో కూర్చున్నారు. కాగా మండలి సమావేశాలు వాయిదా పడిన తరువాత నన్నపనేనిని పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.