
నన్నపనేనిని తోసేసిన స్వామిగౌడ్
హైదరాబాద్ : శాసనమండలిలో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్సీలు ఆ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండలి మీడియా పాయింట్ వద్ద సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీల మధ్య తోపులాట జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన సతీష్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి తదితరులు బిల్లు తప్పులు తడకలుగా ఉందని, ఇలాంటి బిల్లును కనీసం చూసుకోకుండా ఎలా ప్రవేశపెడతారని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని మండిపడుతూ మీడియా పాయింట్లో మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వారు అక్కడ ఉండగానే టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్వామిగౌడ్, మరికొందరు ఎమ్మెల్సీలు, కపిలవాయి దిలీప్ కుమార్ తదితరులు కూడా అక్కడకు వచ్చారు. సీమాంధ్ర ఎమ్మెల్సీలను మాట్లాడనివ్వకుండా వారిని అడ్డుకుంటూ తెలంగాణ నినాదాలు చేయసాగారు.
ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా సతీష్ రెడ్డి, నన్నపనేనిలపై చేయి చేసుకుని వారిని తోసేశారు. దీంతో నన్నపనేని రాజకుమారి కింద పడిపోయారు. ఇద్దరు ఎమ్మెల్సీలు ఆమెను చేతులు పట్టుకుని పైకి లేవదీయాల్సి వచ్చింది. ఈ సంఘటన తర్వాత ఎదురుగా ఉన్న టేబుల్ మీదకు నన్నపనేని ఎక్కి, ఆవేశంగా మాట్లాడుతూ, నినాదాలు చేస్తుండగా, స్వామిగౌడ్ కూడా ఆమెకు పోటీగా టేబుల్ మీదకు ఎక్కి మాట్లాడటం, నినాదాలు చేయడం మొదలుపెట్టారు. పెద్దల సభ అన్న గౌరవం కూడా ఉంచకుండా తోటి సభ్యుల మీద చేయి చేసుకోవడం, తోసేయడం లాంటి చర్యలు పాల్పడ్డారు.