
పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పక్కనే ప్రచారం నిర్వహిస్తున్న నారా లోకేశ్
సాక్షి, అమరావతి : టీడీపీ అతి ప్రచారం దేవుడి సన్నిధిలోని భక్తులకు అసహనం తెప్పించింది. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మంత్రి నారా లోకేశ్ పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉదయం 12 గంటల సమయంలో రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్దకు ప్రచార ర్యాలీ చేరుకుంది. పక్కనే ఆలయం ఉందన్న స్పృహ కూడా మరిచిన టీడీపీ నాయకులు ఆలయం పక్కనే డప్పుల మోత మోగించారు. సుమారు రెండు గంటల పాటు పెద్ద పెద్ద సౌండ్ బాక్స్ ఉన్న వాహనాలలో ఆ పార్టీ పాటలు పెట్టి హోరెత్తించారు.
సోమవారం కావడంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. భక్తులు తీవ్ర అసహనానికి గురవుతున్నా అవేమీ పట్టన్నట్లు వ్యవహరించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఇతరులకు ఇబ్బందులు లేకుండా ప్రచారం నిర్వహించుకోవాల్సి ఉన్నా... టీడీపీ నాయకులకు అవేమీ పట్టడం లేదు. టీడీపీ నేతల తీరు ఒకలా ఉంటే లోకేశ్ తీరు మరోలా ఉంది. ఆలయం పక్కనే సభ ఏర్పాటు చేసి రాజకీయ ఉపన్యాసం చేశారు. దాదాపు గంట సేపు ఉపన్యాసం ఉండడంతో భక్తులతో పాటు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.