వారికి అండ స్మగ్లర్లు, నేరస్తులే
- అలిపిరి సంఘటనలో దోషి నరసింహారెడ్డి
- మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి అనుచరుడే
సాక్షి కడప: రాయచోటి తెలుగుదేశం నేత, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి, కడప పార్లమెంటు టీడీపీ ఇన్‌ఛార్జ్ శ్రీనివాసులురెడ్డిలకు అండాదండా స్మగ్లర్లు,నేరస్తులేనని రూఢీ అవుతోంది. గత సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన రమేష్‌రెడ్డికి సంబేపల్లె మండలానికి చెందిన రెడ్డినారాయణ, రామాపురం మండలానికి చెందిన స్మగ్లర్ రెడ్డప్పరెడ్డి అనే ఎర్రచందనం స్మగ్లర్లతో పాటు మరికొందరు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి ఘటనలో నిందితుడైన మాజీ నక్సలైట్ రామాపురం మండలం వెంకటరెడ్డిగారిపల్లెకు చెందిన నరసింహారెడ్డి ప్రస్తుతం రమేష్‌రెడ్డి అనుచరునిగా కొనసాగుతున్నాడు.
నరసింహారెడ్డి ఇటీవల జరిగిన వినాయక చవితి ఉత్సవాలలో చంద్రబాబుతో పాటు రమేష్‌రెడ్డి ఫొటోలతో ఫ్లెక్సీలను వేయడం గమనార్హం. అలాగే మాజీ మంత్రి ఆర్.ఆర్. పధమ వర్ధంతి సందర్బంగా చంద్రబాబుతో పాటు రమేష్‌రెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాసులురెడ్డి చిత్రపటాలతో రాయచోటి ప్రాంతంలో అనేక చోట్ల ఫెక్సీలను ఏర్పాటు చేశారు. చంద్రబాబుపై దాడికి పాల్పడిన సంఘటనలో నరసింహారెడ్డికి సంబంధం ఉందని నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తిరుపతి కోర్టు తీర్పుఇచ్చింది.
గతంలో టీడీపీకి చెందిన రామాపురం జెడ్పీటీసీ సిద్దయ్యను,లక్కిరెడ్డిపల్లె మార్కెట్ కమిటీ ఛైర్మన్ సహదేవరెడ్డిని హతమార్చిన సంఘటనలో నరసింహారెడ్డిదే కీలక పాత్ర అని పోలీసులు భావిస్తున్నారు. టీడీపీ నాయకులుగా ఉన్న సైకం బసిరెడ్డి, రవీంద్రరెడ్డిలను కూడా హతమార్చిన సంఘటనలలో కూడా నరసింహారెడ్డి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. రమేష్‌రెడ్డి సోదరులకు ప్రస్తుతం నరసింహారెడ్డి అనుచరుడిగా ఉంటూ రామాపురంలో టీడీపీ తరపున రాజకీయాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒకనాడు చంద్రబాబుకు అత్యంత విరోధి నేడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతుండటం గమనార్హం.