'మోదీ ప్రధాని కాగానే రూ.10 లక్షలతో కోటు, సూటు'
నగరి (చిత్తూరు జిల్లా): ఏడాది పాలనలో ఎలాంటి అవినీతి లేదంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యల్ని సీపీఐ నేత నారాయణ తప్పుపట్టారు. చిల్లర అవినీతి లేదు అని విమర్శించారు. చిత్తూరు జిల్లా నగరిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విదేశీ పర్యటనకు మంత్రుల్ని వదిలేసి కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామికవేత్తల్ని తీసుకెళ్లి, వారికి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారన్నారు. టీ స్టాల్‌లో పనిచేశానని చెప్పుకున్న మోదీ ప్రధాని కాగానే రూ.10 లక్షలతో కోటు, సూటు వేసుకుని విదేశీయానం చేశారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచారంటూ విమర్శించారు. మోదీ పాలన వల్లే శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని, మంత్రుల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.