నేడు గుంటూరులో ప్రధాని పర్యటన | Narendra Modi Tour Today in Guntur | Sakshi
Sakshi News home page

నేడు గుంటూరులో ప్రధాని పర్యటన

Published Sun, Feb 10 2019 4:44 AM | Last Updated on Sun, Feb 10 2019 7:57 AM

Narendra Modi Tour Today in Guntur - Sakshi

సాక్షి, గుంటూరు/అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని హోదాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలుకుతారు. గుంటూరు నగర శివారులోని బుడంపాడు జాతీయ రహదారి సమీపంలో మోదీ పాల్గొనే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గుంటూరు నుంచే రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన సందర్భంగా ఎస్పీజీ ఐజీ ఆలోక్‌ వర్మ, గుంటూరు రేంజ్‌ ఐజీ కేవీవీ గోపాలరావు, గుంటూరు అర్బన్, కృష్ణా, ప్రకాశం ఎస్పీలు, విజయవాడ నగర డీసీపీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సభకు ‘ప్రజా చైతన్య సభ– సత్యమేవ జయతే’అని నామకరణం చేయగా, సభా వేదికకు అటల్‌జీ ప్రాంగణంగా పేరు పెట్టారు. బహిరంగ సభలో ప్రధాని దాదాపు 45 నిమిషాల పాటు రాజకీయ ప్రసంగం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.  

టీడీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉద్రిక్తత 
గత నాలుగున్నర ఏళ్ల పాటు రాజకీయంగా చెట్టాపట్టాలు వేసుకొని కేంద్ర– రాష్ట్రాల్లో పరస్పరం అధికారం పంచుకున్న బీజేపీ– తెలుగుదేశం పార్టీలు తొమ్మిది నెలల కిందట వేరుపడ్డాయి. ఆ తర్వాత రెండు పార్టీలు విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనను అడ్డుకోవాలని, నిరసన తెలియజేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేశారు. గుంటూరులోని పలు ప్రాంతాల్లో మోదీ గోబ్యాక్‌ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాలకు తావిచ్చేలా ఉంది. మోదీ సభ సందర్భంగా ఆందోళనలకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తుండటంతో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. 

సీఎం కార్యాలయం నుంచే కుట్ర: కన్నా 
ప్రధాని సభను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే కుట్ర జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సభ ఏర్పాట్లను శనివారం బీజేపీ రాష్ట్ర నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సభకు వచ్చే వాహనాలను ఆర్టీవో అధికారులతో సీజ్‌ చేయిస్తామని ట్రాన్స్‌పోర్టు యజమానులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి సభను అడ్డుకోండి, అంతు చూడండంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దోచేసిన లెక్కలను మోదీ చెబుతారనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అన్ని పార్టీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరిగే చంద్రబాబు మిగతా వారికి కూడా అంటగడుతున్నారని విమర్శించారు. ఆయన 40 ఏళ్ల అనుభవం ఎందుకూ పనికి రాదని, చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడంటూ కన్నా దుయ్యబట్టారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు తన సొంత జిల్లా చిత్తూరులో తాగునీటి సమస్యను పరిష్కరించలేకపోయారని ఎద్దేవా చేశారు. విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ చేసిన అవినీతి బయటపడుతుందనే భయంతోనే మోదీ సభను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల గురించి మోదీ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తారని తెలిపారు. 

ప్రధాని ఆదివారం పర్యటన ఇలా..
ఉ.10.45: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గుంటూరుకు బయలు దేరుతారు. 
11.05: గుంటూరులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ వద్దకు చేరుకుంటుంది.
11.10: హెలిపాడ్‌ నుంచి ఏటుకూరు బైపాస్‌ రోడ్డులోని బహిరంగ వేదిక సభాస్థలికి బయలుదేరుతారు
11.15: పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ వేదిక వద్దకు చేరుకుంటారు
11.15–11.20: ప్రధాని చేతుల మీదగా ప్రారంభోత్సవం, శంకుస్థాపన జరిగే ప్రాజెక్టుల గురించి ఆయా శాఖల అధికారులు ప్రధానికి వివరిస్తారు
11.20– 11.25: రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా రూ.7,000 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఓఎన్‌జీసీ, ప్రెటోలియం శాఖ అనుబంధ సంస్థ చేపట్టిన రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. మరో రూ.2,280 కోట్లతో బీపీసీఎల్‌ సంస్థ కృష్ణపట్నం పోర్టులో కోస్టల్‌ టర్మినల్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు.
11.30: ప్రారంభోత్సవ కార్యక్రమాల వేదిక నుంచి బయలుదేరి బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు
11.30–12.15: బహిరంగ సభలో పాల్గొంటారు
12.20: బహిరంగ వేదిక సభాస్థలి నుంచి బయలుదేరుతారు
12.25: గుంటూరులోని హెలిపాడ్‌కు చేరుకుంటారు
12.30: ప్రత్యేక హెలిక్టాపర్‌లో విజయవాడ ఎయిర్‌పోర్టుకు బయలుదేరతారు. 
12.50: గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement