వర్సిటీల ఈసీలపై గవర్నర్ ఆరా !
వర్సిటీల వారీగా పేర్ల మార్పుపై నివేదిక ఆదేశం
కొలీజియం సిఫారసు ఒకటీ..
ఆమోదం పొందింది మరొకటి
ఒక్కో ఈసీలోని 9 పేర్లలో ముగ్గురు నలుగురి పేర్లు మార్పు
19 వర్సిటీల్లోనూ ఇదే తంతు
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో పాలక మండళ్లపై (ఈసీ) గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దృష్టిసారించారు. మూడేళ్లుగా పాలకమండళ్లు లేక యూనివర్సిటీలు సమస్యలతో సతమతం అవుతున్న వైనంపై సోమవారం ‘వర్సిటీలకు పాలక మండళ్లేవీ? శీర్షికన సాక్షి ప్రచురించిన కథనంపై ఆయన స్పందించారు. యూనివర్సిటీలను గాడిలో పెట్టే పనిపై దృష్టి పెట్టారు. ఈసీలను నియమించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదు కొలీజియం సిఫారసులను పక్కనబెట్టి ఈసీల్లోని సభ్యులను మార్చిన వైనంపైనా ఆరా తీశారు. వర్సిటీల వారీగా కొలీజియం సిఫారసు చేసిన పేర్లు.. ఉపముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన మార్పులపైనా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు తెలిసింది.
చాలానే మార్పు చేశారు: రాష్ట్రంలోని 19 వర్సిటీలకు పాలక మండలి సభ్యులను గుర్తించి నియామకం కోసం 2011 మే నెలలో కొలీజియం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అయితే ఆ పేర్లలో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలో మార్పులు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే చివరగా ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తరువాత ఫైళ్లు ఇటీవల ఉప ముఖ్యమంత్రికి వెళ్లాయి. ఈలోగా రాష్ట్రపతి పాలన రావడంతో ఫైళ్లన్నింటినీ ఉన్నత విద్యాశాఖకు పంపించారు. సోమవారం ఈ వ్యవహారంపై సాక్షి కథనం ప్రచురించడంతో ఈసీల నియామకాల ఫైలు కదిలింది. వాటిలో చాలా పేర్లు మారిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో యూనివర్సిటీ ఈసీకి కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో మూడు నాలుగు మారిపోయినట్లు తెలిసింది. ఇలా 19 వర్సిటీల్లోనూ మార్పులు జరిగినట్లు సమాచారం. మరోవైపు స్థానికత విషయంలో సమస్యలున్నట్లు తెలిసింది. అందుకే కొలీజియం పంపిన పేర్లు.. మార్పు జరిగిన పేర్లు.. వారి స్థానికత వంటి అంశాలతో ఉన్నత విద్యాశాఖ నివేదిక రూపొందించే పనిలో పడింది.
ఇదీ విధానం: యూనివర్సిటీ ఈసీలో 14 మంది సభ్యులు ఉంటారు. ఉన్నత విద్య, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, వర్సిటీ ఉపకులపతి, కళాశాల విద్య కమిషనర్ లేదా సాంకేతిక వర్సిటీ అయితే సాంకేతిక విద్య కమిషనర్ ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు 9 మంది ఇతర సభ్యులు ఉంటారు. వారిని కొలీజియం ఎంపికచేస్తుంది. వర్సిటీ కళాశాల నుంచి సీనియర్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్, టీచర్, అఫ్లియేటెడ్ కళాశాల నుంచి ప్రిన్సిపల్, టీచర్, వివిధ రంగాల్లోని నలుగురు ప్రముఖులు ఈసీ లో ఉంటారు. ఈసీ లేనపుడు ఎక్స్-అఫీషియో సభ్యులే పాలిస్తారు.