వైఎస్ జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్న బాధితులు
పిఠాపురం : కాయకష్టం చేసుకుని పైసాపైసా కూడగట్టుకుని పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం భూములు కొనుగోలు చేసుకుంటే వాటిని బలవంతంగా లాక్కుని దిక్కున్న వారికి చెప్పుకోమంటున్నారంటు పలువురు బాధితులు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాకినాడ రూరల్ మండలం చీడిగ వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన 216 జాతీయ రహదారి భూసేకరణ బాధితులు తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. కాకినాడ రూరల్ మండలం నడకుదురు, తూరంగి గ్రామాలకు చెందిన బాధితులు మాట్లాడుతూ 216 జాతీయ రహదారి విస్తరణలో కత్తిపూడి నుంచి దిగమర్రు వరకు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా భూసేకరణ ఏకపక్షంగా జరిగిందన్నారు. పెద్దల ఆస్తులు కాపాడడానికి పేదల భూముల మీదుగా పలు సార్లు ఎలైన్‌మెంటు మార్చి నిరుపేదలను రోడ్డుకీడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాకినాడ రూరల్ మండలం నడకుదురు, తూరంగి గ్రామాల పరిధిలో రోడ్డు కోసం తీసుకున్న భూముల్లో ఎక్కువ శాతం నిరుపేదలు కొనుక్కున్నవేనని వారు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎకరం రూ.కోట్ల వరకు ఉండగా కేవలం రూ.18 లక్షలు మాత్రమే విలువ కడుతున్నారన్నారు. ఇక్కడ గజం రూ.20 వేలకు పైగా ఉందని వారు వాపోయారు. భూములు తీసుకునే ముందు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇళ్లల్లో ఉండగానే పోలీసుల సహాయంతో బలవంతంగా బయటకు లాగిపారేసి పొక్లయిన్లతో ఇళ్లను పడగొట్టి భూములు స్వాధీనం చేసుకున్నారని ఆ విషయంపై ఆందోళనకు దిగితే అధికార పార్టీ నేతలు తమను తప్పుదోవ పట్టించి ఆందోళనను విరమింపజేశారని వాపోయారు. ఉన్న ఆస్తి పోవడంతో పిల్లల పెళ్లిళ్లు చదువులు ఆగిపోయి ఆత్మహత్యలు చేసుకునే దుస్తితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కోల్పోయిన భూములకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం సక్రమంగా అందేవిధంగా చూసి తమను కాపాడాలని బాధితులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద కన్నీటిపర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment