‘ప్రత్యేక హోదా ఎప్పుడొస్తుందో చెప్పలేం
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
సాక్షి, విజయవాడ బ్యూరో: ‘ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు. అయితే ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేం’ అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి ఉందని, అయినప్పటికీ పలు కారణాల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందన్నారు. విజయవాడలో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లోటు బడ్జెట్ ఉన్న బెంగాల్, కేరళ, ఏపీలకు అదనంగా 14వ ఆర్థిక సంఘం నిధులిస్తున్నామన్నారు.
హోదా రాకపోవడం వల్ల పరిశ్రమల ఏర్పాటుకు ఇబ్బందులు ఎదురవుతాయనేది నిజమేనన్నారు. విశాఖపట్నం-కాకినాడ, గన్నవరం-కంకిపాడు, శ్రీకాళహస్తి-ఏర్పేడు పారిశ్రామికవాడల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. విజయవాడలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌ను నెలకొల్పుతున్నామన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తాత్కాలికంగా ఈ సంవత్సరం నుంచే అది ఏర్పాటవుతుందన్నారు.