గర్భంలో శిశువు ఏర్పడిన తొలి రోజు నుంచి బిడ్డ పుట్టిన రెండేళ్ల వరకు జాతీయ పోషణ మిషన్ కింద ఆరోగ్య, పోషణ సంరక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మహిళ గర్భం దాల్చిన రోజే పేరు నమోదు చేసుకొని బిడ్డ పుట్టేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన ఆహారం తీసుకోవాలనే దానిపై అంగన్‌వాడీలచే అవగాహన కల్పించనుంది.ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు అన్న అమృతహస్తం కింద పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. బాల సంజీవని పేరుతో నిరుపేద ఎస్సీ గర్భిణులు, బాలింతలకు బలవర్థకమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గర్భం దాల్చిన మహిళ సుఖ ప్రసవం జరిగే వరకు, సుఖ ప్రసవం అనంతరం బిడ్డ ఆరోగ్యంగా పుట్టేందుకు, ఆ తరువాత తల్లీ బిడ్డలసంరక్షణ కోసం జాతీయ పోషణ మిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం వేతనం పెంచగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అడుగు ముందుకు వేసి దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలవేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలను అంగన్‌వాడీలు అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో అడగకుండానే కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీల వేతనాలు పెంచి జాతీయ పోషణ మిషన్‌లోవారిని పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసేందుకు క్షేత్ర స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఒంగోలు టౌన్: జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ పరిధిలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల పరిధిలో 4244 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో 16201 మంది గర్భిణులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 20320 మంది బాలింతలు ఉన్నారు. ఒకటి నుంచి మూడేళ్లలోపు వయసు కలిగిన చిన్నారులు 1,03,852 మంది ఉన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా కేంద్రాల పరిధిలోని గర్భిణులు, బాలింతల పోషణ స్థితిపై అంగన్‌వాడీలు ఎప్పటికప్పుడు సమగ్ర వివరాలు సేకరించనున్నారు. గర్భిణీ పేరు నమోదు చేసుకున్న తరువాత జాతీ య పోషణ మిషన్ ద్వారా ముద్రించిన స్టిక్టర్లను సంబంధిత గర్భిణీ ఇంటి తలుపుకు అంటించనున్నారు. ఆ గర్భిణీతో పాటు, బిడ్డ పుట్టిన తరువాత వారి పోషణ స్థితి వివరాలను ప్రత్యేకంగా ముద్రించిన స్లిప్పుల ద్వారా నమోదు చేసుకోనున్నారు. ఆ స్లిప్పులో బిడ్డ పేరు, తల్లి–తండ్రి పేరు, బిడ్డ వయసు, బరువు, ఎత్తు, గత నెలలో ఆ బిడ్డ ఎంత బరువు ఉంది, ఈ నెలలో ఎంత బరువు ఉంది, పెరుగుదల ఏ వి«ధంగా ఉంది, బిడ్డ పోషణ స్థితి ఎలాగుందో వివరాలు నమోదు చేసి వాటిని తమ అధికారుల ద్వారా ఉన్నతాధికారులకు తెలియజేయనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు అందించే పౌష్టికాహారంలో ఎలాంటి పోషక విలువలు ఉంటాయో తెలియజేయడంతో పాటు ఆరోగ్యపరమైనజాగ్రత్తలు, సంరక్షణ గురించి కూడా అంగన్‌వాడీలు గర్భిణులకు వివరించనున్నారు. పోషణకు సంబంధించి ఎక్కువగా పాలు తీసుకోవడం, పండ్లు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, కోడిగుడ్లు తీసుకోవడం ద్వారా ఆ మహిళతోపాటు గర్భంలో పెరిగే శిశువు కూడా ఆరోగ్యంగా ఏ విధంగా ఉంటుందో తెలియజేయనున్నారు.
నా హక్కు.. నా బాధ్యత..
జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా గర్భిణులను కూడా చైతన్యవంతులను చేయనున్నారు. నా హక్కు, నా బాధ్యత పేరుతో గర్భిణీని కూడా భాగస్వాములను చేసేందుకు చర్యలు చేపట్టారు. అత్తగారింట్లో ఉన్నా, అమ్మగారింట్లో ఉన్నా సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పేరు రాయించుకోవడం నా హక్కు. అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతిరోజూ భోజనం, గుడ్డు, పాలు, ఇతర పోషకాహారం తీసుకోవడం నా హక్కు. క్రమం తప్పకుండా రక్త పరీక్షలు, వైద్య పరీక్షలు చేయించుకోవడం నా హక్కు. గర్భిణీగా ఉన్నప్పుడు ఐరన్, క్యాల్షియం మాత్రం పొందడం నా హక్కు. గర్భిణీగా ఉన్నప్పుడు, అలాగే బాలింతగా ఆరునెలల వరకు అంగన్‌వాడీ సేవలు పొందడం ్నా హక్కు. అంటూ గర్భిణీని కూడా ఇందులో భాగస్వాములను చేయనున్నారు. అదే విధంగా నా ఆరోగ్యం, నా బిడ్డ ఆరోగ్యం, సరైన పోషణ నా బాధ్యత. నాకు పుట్టబోయ బిడ్డ సరైన బరువుతో పుట్టేలా చూసుకోవడం నా బాధ్యత. నాకు బిడ్డ పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టడం, ఆరునెలల వరకు తల్లిపాలు ఇవ్వడం నా బాధ్యత. నా బిడ్డకు ఆరునెలలు నిండిన తర్వాత బాలామృతం, వయసుకు తగిన ఇతర పోషకాహారం తినిపించడం నా బాధ్యత. ప్రతినెలా అంగన్‌వాడీ కేంద్రంలో బిడ్డ పెరుగుదల చూపించడం నా బాధ్యత అంటూ బాలింతను కూడా భాగస్వాములను చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment