ప్రధాని నరేంద్ర మోడీ దేశాభివృద్ధి కోసం రోడ్లను ఊడుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన...
విద్యానగర్(గుంటూరు): ప్రధాని నరేంద్ర మోడీ దేశాభివృద్ధి కోసం రోడ్లను ఊడుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన 13వ ఆర్థిక సంఘం నిధులను ఊడ్చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మండిపడ్డారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాలు, మండలాలు, జిల్లా పరిషత్తుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రప్రభుత్వం ఈ నెల 3వ తేదీన 13వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని నిధులను జోడించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా సీఎం చంద్రబాబు వాటిని స్థానిక సంస్థలకు దక్కనీయలేదన్నారు. అంతేకాకుండా విద్యుత్ బకాయిలను స్థానిక సంస్థలే చెల్లించాలనటం దారుణమన్నారు. ఆయూ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రజలకు సౌకర్యాలు లభించకుండా చేసేందుకు తీసుకున్న దుర్మార్గపు చర్య ఇదని అన్నారు. ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మిగిలాయని విమర్శించారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మైనింగ్ సెస్, ఇతర పన్నులను స్థానిక సంస్థల అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేశారు. 13వ ఆర్థిక సంఘం నిధులను మళ్ళించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు శాయశక్తులా కృషి చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వకపోగా కేంద్రమిస్తున్న నిధులను దారి మళ్లించటం తగదన్నారు. దీనిపై ప్రజలతో కలిసి పోరాటం చేసి బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
తాడికొండ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కత్తెర సురేష్‌కుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధులను గ్రామాలు, మండలాలు, జిల్లా పరిషత్‌ల పరిధిలో పారిశుద్ధ్య పనులు, సౌకర్యాల కల్పనకు వినియోగించాలన్నారు. చంద్రబాబు తీరు వల్ల స్థానిక సంస్థల ప్రతినిధులు ఆటబొమ్మలుగా మిగలనున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారకుంటే ప్రజా ఉద్యమం తప్పదన్నారు. సమావేశంలో పార్టీ సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, గుంటూరు రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, మండేపూడి పురుషోత్తం, నర్శిరెడ్డి, ఇంటూరి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.