
ఎర్రగుంట్ల: దేశ, విదేశాలలో కడప నాపరాయికి అధిక డిమాండ్ ఉంటోంది. జిల్లాలో ఎర్రగుంట్ల పరిధిలో నాపరాళ్ల పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గనులలో నీరు నిలిచింది. దీంతో పనులు నిలిచిపోయాయి. వీటిపై ఆధారపడ్డ కార్మికులు ఉపాధి కోల్పోయారు. నాపరాయి గనులకు నిడుజివ్వి గ్రామం నిలయం. ఈ గ్రామ పరిధిలోనే దాదాపు ఎక్కువ గనులు ఉన్నాయి. గనుల్లో దాదాపు 40 అడుగుల లోపలి నుంచి రాళ్లను బయటకు తీస్తారు. ఈ రాళ్లపైనే ఆధారపడి పాలీష్ మిషన్లు నడస్తున్నాయి.
మునిగిన మిషన్లు
నాపరాయి పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 వేల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. 150 దాకా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో సుమారు 50 మూత పడ్డాయి. నీటిలోనే రాళ్లు, కోత మిషన్లు మునిగిపోయాయి. దీంతో అవి దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. నీటిని తోడేసే పనిలో యజమానులు నిమగ్నమయ్యారు. తోడేసినా.. ఊట ద్వారా నీరు మళ్లీ చేరుతోంది. రాళ్ల మధ్య నుంచి నీరు అధికంగా ఊరుతోంది. దీంతో గనుల నుంచి నీరు తొలగడం లేదు. దాదాపు రెండు వారాలుగా పరిశ్రమల్లో పనులు ఆగిపోయాయి. దీంతో కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. రోజూ పనికి వెళ్తేనే వీరికి పూట గడిచేది. ఈ నేపథ్యంలో అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.