ఎన్‌సీడీపై నీలినీడలు
Published Wed, Jan 1 2014 4:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: అసంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమం (ఎన్‌సీడీ)పై నీలినీడలు కమ్ముకున్నాయి. మంజూరై మూడేళ్లవుతున్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. కనీసం సిబ్బందిని కూడా నియమించలేదు. జిల్లాకు 2010లో ఎన్‌సీడీ కార్యక్రమం మంజూరయింది. బీపీ, మధుమేహం, ఆస్తమా, ఊబకాయం వంటి రోగులకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే కార్యక్రమం ప్రారంభించడంలో చూపించిన శ్రద్ధ ఆచరణలో చూపించలేదు. జిల్లాలో ఉన్న 12 సీహెచ్‌సీల్లో 12 ఎన్‌సీడీ క్లినిక్‌లు, కేంద్రాస్పత్రిలో 10 పడకల వార్డును ఏర్పాటు చేయాలి. నెల్లిమర్ల, బాడంగి, కురుపాం, ఎస్.కోట, గజపతినగరం, సాలూరు, పార్వతీపురం, భద్రగిరి, చీపురుపల్లి, జియ్యమ్మవలస, బొబ్బిలి, భోగాపురం సీహెచ్‌సీల్లో ఎన్‌సీడీ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలి. అయితే క్లినిక్‌లకు గదులు కేటాయించారు కానీ అందులో పనిచేయడానికి సిబ్బంది లేరు. దీంతో అవి నిరుపయోగంగా మిగిలాయి. కేంద్రాస్పత్రిలో పది పడకల వార్డును కేటాయించారు. ఇక్కడ కూడా సిబ్బంది లేకపోవడంతో మూత పడింది. అదేవిధంగా క్లీనిక్‌లను పర్యవేక్షించడానికి జిల్లా మేనేజర్ కూడా నియమించలేదు.
నోటిఫికేషన్ ఇచ్చి.....
ఎన్‌సీడీ క్లినిక్‌లలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి రెండు పర్యాయాలు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇంతవరకు నియూమకాలు చేపట్టలేదు. 2012లో జిల్లా స్థాయిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి నోటిఫికేషన్ ఇచ్చారు. 12 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 16 స్టాఫ్ నర్సులు, 12 కౌన్సిలర్లు, ఒక స్పెషలిస్టు వైద్యుడు, ఐదుగురు ఎంబీబీఎస్ వైద్యులు, లాజిస్టక్ ఆఫీసర్, లాజిస్టక్ ఆఫీసర్ అసిస్టెంట్ ఒకరు, 12 మంది ల్యాబ్ టెక్నీషయన్లు, 12 మంది వాచ్‌మన్ పోస్టులకు నోటి ఫికేషన్ ఇచ్చారు. వీటికి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. అయితే నియూమకాలను మాత్రం చేపట్టలేదు. తర్వాత జిల్లా స్థాయిలో నోటిఫికేషన్‌ను రద్దచేస్తున్నామని ప్రకటించి, తిరిగి 2013లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎన్‌సీడీల్లో పనిచేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో జిల్లా నుంచి సుమారు 500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి ఎనిమిది నెలలవుతున్నా ప్రభుత్వం ఇంతవరకు ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. ఎన్‌సీడీక్లినిక్‌లు ఉన్నప్పటి కీ వాటిలో పనిచేయడానికి వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో బీసీ, మధుమేహం, మూర్ఛ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవలు నిలిచిపోయాయి.
Advertisement
Advertisement