
ఆస్పత్రిలో ఆకలిమంటలు
జబ్బు నయంచేసుకోవాలని రోగులు సర్కార్ ఆస్పత్రికెళితే అక్కడ కొత్తరోగం వచ్చేట్టుంది. ఏది పెట్టినా తింటారులే అనే నిర్లక్ష్యంతో నాణ్యతలేని టిఫిన్, భోజనం వడ్డిస్తూ రోగుల కడుపు మాడ్చుతున్నారు. నాణ్యతను పరిశీలించాల్సినఆస్పత్రి వర్గాలు పట్టించుకోవడంలేదు. సర్కార్ ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చేదంతా నిరుపేదలే. బయట ఆహారం కొని తినలేని పరిస్థితి. ఆస్పత్రిలో ఇచ్చే నాసిరకం తిండి తినలేక ఆకలితో కడుపుమాడ్చుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న దీనావస్థలివీ.
చిత్తూరు (క్రైమ్),న్యూస్‌లైన్: చిత్తూరులోని 300 పడకల ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుంది. జిల్లా వ్యాప్తంగా పీహెచ్‌సీల నుంచి సీరియస్ కేసులను ఇక్కడికి రెఫర్ చేస్తుం టారు. వీరుగాక ఆస్పత్రికి రోజూ 1000 మందికిపైగా రోగులు వస్తుంటారు. ఆపరేషన్లు, ప్రాణాంతక జబ్బులతో పాటు డెలివరీ కేసులవారు 3 నుంచి 15 రోజుల పాటు ఆరోగ్యం కుదుటపడేవరకు ఆస్పత్రిలోనే చికిత్సపొందుతారు. వీరు ఆస్పత్రిలో అడ్మిట్టయినప్పటినుంచి డిశ్చార్జ్ అయ్యేవరకు పౌష్టికాహారం అందివ్వాలి. ఈ క్రమంలో టిఫిన్, భోజనం, పండ్లు, పాలు, కోడిగుడ్డు సరఫరా చేసే బాధ్యతను కాంట్రాక్టర్‌కు అప్పగించారు.
టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మాత్రం ఉదయం నీళ్లపాలు, రాళ్లులాంటి గట్టి ఇడ్లీలు, నీళ్ల సాంబారు, ఉడికీ ఉడకని అన్నం మెతుకులను వడ్డిస్తున్నారు. ఈ ఆహారం తింటున్న రోగులు నానా అవస్థలు పడుతున్నారు. నాణ్యతలేని ఆహారం గురించి నిర్వాహకులను ప్రశ్నిస్తే రోగులపై తిరగబడుతున్నారు. పెట్టేది ఇంతే ... ఎవరికైనా చెప్పుకోండి... ఏం భయం లేదు అంటున్నారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్ సరఫరాచేసే భోజనాన్ని ఆస్పత్రి అధికారి పరీక్షించి నాణ్యతను నిర్ధారించిన తరువాతే రోగులకు వడ్డించాలి.
నాణ్యతలో తేడా వస్తే కాంట్రాక్టర్‌ను హెచ్చరించాలి. లేదా ఆ కాంట్రాక్టును రద్దుచేయడానికి ఉన్నతాధికారులకు సిఫారసు చేయాలి. అయితే ఫుడ్ క్వాలిటీని పరీక్షించాల్సిన ఆస్పత్రి అధికారి ఇవన్నీ పట్టించుకున్న పాపానపోలేదు. దాంతో కాంట్రాక్టర్ ఏది వడ్డిస్తే అది తినాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతిరోజూ రోగులకు అరటిపండు, ఆరంజ్, ఆపిల్ తదితర పండ్లలో ఏదో ఒకటి అందించాల్సివున్నా రోగులకు పంపిణీ చేయడంలేదు.
భోజనం అధ్వానం
ఆపరేషన్ చేసుకుని వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నా. ప్రతిరోజూ 6 నుంచి 10 మాత్రలు మింగుతుండటంతో కడుపులో చాలా మంటగా ఉంది. ఇక్కడ వడ్డిస్తున్న భోజనం తింటే కడుపుమంటతో పాటు భరించలేని కడుపునొప్పి వస్తోంది. నాసిరకం భోజనం ఇస్తుండడంతో త్వరగా కోలుకోలేకపోతున్నాం.
-అర్జునయ్య, నలగాంపల్లె, బంగారుపాళెం మండలం
దిక్కున్న చోట చెప్పుకో అంటున్నారు
ఇడ్లీ గట్టిగా ఉందని, పాలు నీళ్లుగా ఉన్నాయని అడిగితే దిక్కున్నచోట చెప్పుకో అంటూ బెదిరించారు. వారం రోజుల నుంచి ఫుడ్ కాంట్రాక్టర్ ఇచ్చే పాలు, టిఫిన్, భోజనం కిందపడేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా పండ్లు ఇవ్వలేదు. కాంట్రాక్టర్ తీరుపై విచారణ చేసి రోగులకు న్యాయం చేసేలా అధికారులు చొరవచూపాలి.
-శ్రీనివాసులు, దిగువ కామినేపల్లె, ఐరాల మండలం
రోగులపై తిరగబడితే చర్యలు తీసుకుంటాం
రోగులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని కచ్చితంగా మెనూ ప్రకారం అందించాలి. నాణ్యత లేదని ప్రశ్నించిన రోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఫుడ్ కాంట్రాక్టర్‌పై ఉంది. అలాకాకుండా రోగులపైనే విరుచుకుపడటం.. ఎవరికైనా చెప్పుకో అనడం సరికాదు. ఈ విషయంపై విచారణ జరిపి తగుచర్యలు తీసుకుంటాం.
-సరళమ్మ, డీసీహెచ్‌ఎస్.