ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు అన్నపూర్ణగా వెలుగొందుతున్న ఆధునిక దేవాలయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు. వేల కార్మికుల శ్రమశక్తితో నిర్మితమై, తెలుగు ప్రజలను కరవు రక్కసి కబంధహస్తాల నుంచి కాపాడిన అద్భుత కట్టడం. 22 లక్షల ఎకరాలకు సాగు నీరు, పలు పట్టణాలు, వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తూ, విద్యుదుత్పాదనతో వెలుగులీనుతున్న మానవ నిర్మిత మహాసాగరం..నేడు అధికారుల నిర్లక్ష్యానికి గురికావడం క్షోభను కలిగిస్తోంది.
విజయపురిసౌత్
నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణకు ఏటా రూ. కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కాగితాల్లో చూపుతున్నా డ్యాం నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. డ్యాం రక్షణకు ఏర్పాటు చేసిన గోడలు పగిలి అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. ఇరువైపులా పేర్చిన రాతి బండలు పక్కకు కదిలాయి. డ్యాంపై రోడ్డుకు ఇరువైపులా వేసిన కేబుల్‌పై గతంలో సిమెంట్ ప్లేట్లు అమర్చారు.
కాలగర్భంలో సిమెంటు ప్లేట్లు శిథిలమై పోగా అక్కడక్కడా పరిచిన నాపరాళ్లూ లేక కొన్ని చోట్ల కేబుల్ దర్శనమిస్తోంది. సాగర్ డ్యాం అంతర్భాగం నుంచి వచ్చే ఊట నీటిని తొలగించడానికి 250కి పైగా రంధ్రాలు ఉన్నాయి. నీటి కారణంగా ఈ రంధ్రాలు కాల్షియంతో మూసుకుపోతున్నాయి. ఈ కాల్షియం తొలగించడానికి టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. ఈ పనుల్లో భాగంగా డ్యాం పునాదుల్లో డ్రిల్లింగ్ చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. రంధ్రాల సమస్య మాత్రం అలానే ఉండిపోయింది.
డ్యాం పటిష్టతలో కీలక పాత్ర వహించిన ఎర్త్‌డ్యాం నిర్వహణ పట్ల కూడా అధికారుల చిత్తశుద్ధి కరువయ్యంది. ఇరవై ఏళ్ల కిందట కుడివైపు ఎర్త్ డ్యాంకు క్యావిటీ(సన్నపాటి రంధ్రం) ఏర్పడింది. దాని అంతు చిక్కక అధికారులు కుడివైపు ఎర్త్ డ్యాంకు పేర్చిన రివిట్‌మెంటు రాళ్లను కిలోమీటరు మేర పెకిలించారు. క్యావిటీ దొరకకపోవడంతో ఆ పనిని అలానే వదిలివేశారు. నేటికీ చెదిరిన రాళ్లు దర్శనమిస్తున్నాయి.
ఎర్త్ డ్యాంల రోడ్లకు ఇరువైపులా ఉన్న గోడలపై ప్రత్యేకంగా డిజైన్‌చేసి పరిచిన రాళ్లు కూలేదశలో ఉన్నాయి. సాగర్ అందాలను ఇనుమడింపజేసే విధంగా ఏర్పాటు చేసిన లైట్లు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు.
డ్యాం భద్రత కోసం కుడి, ఎడమ ప్రధాన డ్యాంలపై లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన రిమోట్ కంట్రోల్‌తో నడిచే గేట్లు పనిచేయడం లేదు. ఎస్పీఎఫ్ సిబ్బంది వాహనాలు డ్యాం మీదకు వచ్చినప్పుడు చేతులతో పక్కకు నెడుతూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు డ్యాం నిర్వహణపై శ్రద్ధ పెట్టాలని పలువురు ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
సాగర్‌డ్యాం నిర్వహణలో నిర్లక్ష్యం
Published Mon, Dec 1 2014 12:55 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement
Advertisement