బనగానపల్లె/కోవెలకుంట్ల: తెలుగుదేశం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్సార్బీసీ)ని వరుస గండ్లు వెంటాడుతున్నాయి. కర్నూలు, వైఎస్‌ఆర్ జిల్లాల్లోని 1.92 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన కాల్వ గత ఆరేడేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆదివారం తెల్లవారు జామున బనగానపల్లె సమీపంలో ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు భారీ గండి పడటంతో పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. రెండేళ్ల క్రితం ఇదే కాలువకు భారీ గండి పడి పంట పొలాలు నీట మునిగి నష్టం సంభవించింది. అదే ఏడాది అవుకు సమీపంలో మరో గండి పంట పొలాలను ముంచెత్తింది.అప్పుడు తాత్కాలిక మర మ్మతులతో సర్కార్ చేతులు దులుపుకున్న ఫలితంగా ఆదివారం భారీ గండి పడి బనగానపల్లె వాసులను భయాందోళనకు గురిచేసింది. ఎస్సార్బీసీని పటిష్టం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సర్కార్ నిద్రమత్తులో తూగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్న విమర్శలు తాజా గండి నేపథ్యంలో వెల్లువెత్తుతున్నాయి.
గండికి ప్రధాన కారణాలు
గత ఏడాది అధికారులు అనాలోచితంగా ప్రవాహస్థాయికి మించి కాల్వకు నీటిని విడుదల చేశారు. అప్పటి నుంచి ఏడాదిగా కాల్వ పటిష్టతను పట్టించుకున్న దాఖలాలు లేవు. నీరు–చెట్టు పథకం కింద కాల్వలోకి జేసీబీలను దించి పనులు చేయించే సమయంలో కాల్వ దెబ్బతినడం, కట్టపై నిత్యం భారీ వాహనాలు తిరగడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్ల మళ్లీ గండి పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కాల్వ పటిష్టతను పరిశీలించిన తర్వాత నీటిని విడుదల చేయాల్సిన అధికారులు అదేదీ పట్టించుకోకుండా సామర్థ్యానికి మించి ఒకేసారి నీటిని విడుదల చేయడంతో గండి పడి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
ముందస్తు సమాచారం లేకుండానే..
శుక్రవారం వరకు ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ ద్వారా నీటిని విడుదల చేయని అధికారులు శనివారం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒకేసారి సుమారు 1,500 క్యూసెక్కులు విడుదల చేయడంపై కొందరు ఇంజనీరింగ్ అధికారులే తప్పుబడు తున్నారు. ప్రధాన కాల్వ దెబ్బతిన్నందున దశలవారీగా నీటిని విడుదల చేయాల్సిన అధికారులు ఇలా ఒకేసారి విడుదల చేయడంతో గండ్లు పడే ప్రాంతాలను అధికారులు గుర్తించలేకపోయారు.
కట్టుబట్టలతో రోడ్లపైకి ...
ఎస్సార్బీసీకి గండి పడి నీరంతా బనగానపల్లె పట్టణంలోని వివిధ కాలనీల్లోకి చేరింది. పెండేకంటి నగర్, ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, ఈద్గానగర్, ఎరుకలికాలనీ.. తదితర ప్రాంతాలను నీరు ముంచెత్తింది. ఎరుకలి కాలనీలోని ఇళ్లలో రెండు అడుగుల లోతు నీరు ప్రవహించి బియ్యం, కందిపప్పు, వంట సామగ్రి తడిచిపోయింది. ఆర్టీసీ బస్టాండ్, పెట్రోల్‌బంకు, పవర్ హౌస్ ప్రాంతానికి విస్తరించడంతో ఈ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఆర్టీసీ వాహనాల రాకపోకలు నిలిచిపోగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోకి భారీగా నీరు చేరడంతో ప్రహరీకి గండి కొట్టారు. దీంతో ఈద్గానగర్ జలదిగ్బంధమైంది. ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీవాసులు కట్టుబట్టలతో రోడ్డుపైకి చేరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్లపై గడపాల్సి వచ్చిందని, అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో.. పండుగ పూట చిన్నపిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటించాల్సి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
Published Mon, Oct 2 2017 1:49 AM | Last Updated on Mon, Oct 2 2017 7:47 AM
Advertisement
Advertisement