కర్నూలు(అర్బన్) : సాగునీటి శాఖలో కాంట్రాక్టర్ల ఒత్తిళ్లకు ఇంజనీర్లు విలవిలలాడుతున్నారు. నిర్ణీత ప్రమాణాల మేరకు పనులు నాణ్యతగా చేయకపోయినప్పటికీ బిల్లులు చెల్లించాల్సిందేనంటూ కాంట్రాక్టర్లు ఒత్తిళ్లు చేస్తున్నారు. మరమ్మతులు, ఆధునికీకరణ, పునరుద్ధరణ (ట్రిపుల్ ఆర్) పథకం కింద 8 చెరువుల్లో చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వాలంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నారు. ఈ బిల్లుల జారీ ఫైలు కలెక్టరేట్‌లో చక్కర్లు కొడుతున్నా బిల్లులకు మాత్రం మోక్షం లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే సాగునీటిశాఖ ఎస్‌ఈ నాగేశ్వరరావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. కాంట్రాక్టర్ల ఒత్తిళ్లు తట్టుకోలేకే సెలవులో వెళుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, సొంత పనులకే సెలవులో వెళుతున్నానని ఎస్‌ఈ అంటున్నారు. తాత్కాలికంగా ఇంచార్జీ ఎస్‌ఈగా ఎస్‌ఆర్‌బీసీ ఎస్‌ఈ శ్రీనివాసరావు నియమితులయ్యారు. మొత్తం మీద తాజా పరిణామాలు సాగునీటి శాఖలో కలకలం రేపుతున్నాయి.
రూ. 70 లక్షల బిల్లుల కోసం ఒత్తిళ్లు!
జిల్లాలోని 8 చెరువుల్లో ట్రిపుల్ ఆర్ పథకం కింద కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి రూ.70 లక్షలను కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి వుంది. అయితే ఈ పనులకు సంబంధించి బిల్లులను మంజూరు చేయాల్సిన జిల్లా కలెక్టర్ పలు పనులను పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేయడమే గాక, బిల్లుల ఫైల్‌ను తిప్పి పంపించేసినట్లు తెలుస్తోంది. అయితే కాంట్రాక్టర్లు మాత్రం బిల్లులను చెల్లించాలని ఎస్‌ఈపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచినట్లు సమాచారం. అంతేగాక ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనుల విషయంలో కూడా ఎస్‌ఈపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే తగినంత మంది సిబ్బంది లేని కారణంగానే పనుల్లో పురోగతి కనిపించడం లేదనే విషయాన్ని ఎస్‌ఈ కలెక్టర్ దృష్టికి తీసుకుపోలేక పోవడం వల్లే మాట పడాల్సి వచ్చిందని నీటి పారుదల శాఖ ఉద్యోగులే చెప్పుకోవడం గమనార్హం.
ఈ పోస్టు కోసం పైరవీలు షూరూ...!
మరోవైపు జిల్లా నీటి పారుదలశాఖకు ఎస్‌ఈగా వచ్చేందుకు పక్క జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మరో ఎస్‌ఈ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గ్రీన్ సిగ్నల్ కోసం ఆయన ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కారణాలు ఏవైనా వ్యక్తిగత పనుల నిమిత్తం ఎస్‌ఈ ఆర్ నాగేశ్వరరావు ఈ నెల 3వ తేదీ నుంచి మార్చి 21 వరకు సెలవు పెట్టారు. ఎస్‌ఈ నాగేశ్వరరావు సెలవుపై వెళ్లిన దృష్ట్యా నంద్యాల ఎస్‌ఆర్‌బీసీ సర్కిల్-1 ఎస్‌ఈ శ్రీనివాసరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తు నీటి పారుదలశాఖ (పరిపాలన) ఈఎన్‌సీ రవికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇంచార్జి ఎస్‌ఈ శ్రీనివాసరావు ఈ నెల 4వ తేదీన రానున్నారు.
బిల్లులు చెల్లించాల్సిందే!
Published Wed, Feb 4 2015 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM
Advertisement
Advertisement