శ్రీకాకుళం అర్బన్: మతోన్మాదానికి వ్యతిరేకంగా అందరం కలసి పోరాడుదాం అని.. దీనిపై ప్రజలంతా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని సీపీఐ(ఎంఎల్) న్యూడె మోక్రసీ పేర్కొంది. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద శనివారం మతోన్మాదానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టింది. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ మాట్లాడుతూ డిసెంబర్ 6ని బ్లాక్ డే గా ప్రకటించాలన్నారు. అభివృద్ధి, గుజరాత్ నమూనా అని బీజేపీ పెద్ద ఎత్తున సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేసి మైనారిటీల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిందన్నారు.
ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క యూపీలోనే 605 మతోన్మాద సంఘటనలు జరిగాయని జాతీయ మీడియా ప్రకటించిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో కూడా చాలా చోట్ల మత ఉద్రిక్తతలు జరిగాయన్నారు. దీని వెనుక బీజేపీ సంఘ్ పరివార్ శక్తులు హస్తం ఉందన్నారు. జామియా మసీదు అధ్యక్షుడు మీర్ సభికుల్లా మాట్లాడుతూ మా ఆస్థులకు, మాకు రక్షణ కల్పిస్తామని రాజ్యాంగంలో రాసినా అవి ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. చంపాగల్లీ మసీదు అధ్యక్షుడు షేక్ అల్లీజాన్ మాట్లాడుతూ ప్రజలంతా ఒక్కటే అని అన్ని మతాలు చెబుతున్నాయని, వాటిని పక్కన పెట్టి దాడులు చేయడమంటే దీని వెనుక రాజకీయ కోణం ఉందని స్పష్టమవుతోందన్నారు.
జనా నా మసీదు అధ్యక్షుడు ఎం.డి.హర్షద్ మాట్లాడుతూ బాబ్రీ మసీదును కూల్చడం అంటే మానవహక్కులను కాలరాయడమేనన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కూడలి వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి కళింగ రోడ్ మీదుగా పాతబస్టాండ్‌కు అక్కడ నుంచి చిన బరాటంవీధి నుంచి జీటీరోడ్‌కు అక్కడ నుంచి మరలా వైఎస్సార్ కూడలికి ర్యాలీ తీశారు. కార్యక్రమంలో అఖిల భారత రైతుకూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకట్రావు, అరుణోదయ ప్రతినిధులు ఎం.మల్లేశ్వరరావు, ఎస్.దుర్గ, కె.కృష్ణవే ణి, షాను, రవూఫ్, జిలానీ, రహ్మన్, సయ్యద్ జిలానీ పాల్గొన్నారు.
మతోన్మాదంపై పోరాడుదాం
Published Sun, Dec 7 2014 2:02 AM | Last Updated on Wed, Oct 17 2018 3:43 PM
Advertisement