కొత్త ప్రభుత్వం పాత పథకాలకు మంగళం..
కందుకూరు: కొత్త ప్రభుత్వం రావడంతోనే పాత పథకాలకు మంగళం పాడుతోంది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతుండగా..ప్రస్తుతం మరో భారీ పథకానికి ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లభించడం లేదు. వర్షపు నీటి ముంపు నుంచి కందుకూరు మున్సిపాలిటీని కాపాడే లక్ష్యంతో రూ.100 కోట్ల అంచనాలతో రూపొందించిన భారీ పథకానికి ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగిలింది.
= గుంటూరు నగర కార్పొరేషన్ అంత స్థాయిలో కందుకూరు మున్సిపాలిటీ విస్తీర్ణం కలిగి ఉంది. దాదాపు 61 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మున్సిపాలిటీ సొంతం. 50 వరకు కాలనీలున్నాయి. వీటిలో శివారు ప్రాంతాల కాలనీలన్నీ ఇప్పటికీ సరైన మౌలిక వసతులకు నోచుకోక కునారిల్లుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ కాలనీల్లో పరిస్థితులు మాత్రం మారడం లేదు. పైగా ఎక్కడికక్కడ ఆక్రమించి కట్టుకున్న గృహాలు కావడంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్‌కి విరుద్ధంగా ఇష్టారీతిన ఇళ్లు వెలిశాయి.
= మున్సిపాలిటీలో ఇప్పటి వరకు కేవలం రెండే రెండు కాలనీలకు మున్సిపల్ అనుమతులున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీటిలో వాసవీనగర్. ఐఎస్‌రావ్ నగర్‌లకు మాత్రమే అనుమతులున్నాయి.
= మిగిలిన కాలనీల్లో ఏ ఒక్కదానికి కూడా మున్సిపల్ అనుమతులు లేవు. దీంతో ఈ కాలనీలో ఇష్టారీతిన రోడ్లు, కుంటలు ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇక్కడే అసలు సమస్య తలె త్తుతోంది. కొద్దిపాటి వర్షం కురిసినా దాదాపు 70 శాతం పట్టణంలో నీరు నిలుస్తుంది. ఏ కాలనీలో చూసినా మోకాలు లోతు నీళ్లు పారుతుంటాయి. ప్రతి ఇంటిలోకి నీరు వచ్చి చేరుతుంది.
= ఇక లోతట్టు ప్రాంతాలైన జనార్ధనకాలనీ, ఉప్పుచెరువు, లంబాడిడొంక, శ్రీరామ్‌నగర్, ఏకలవ్యనగర్, శ్రీనగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు తగ్గే వరకు ఇల్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిందే.
= ఉప్పుచెరువులో నీటి ఉధృతికి రెండు, మూడు రోజుల పాటు ఇళ్లలోకి పోయే అవకాశం ఉండదు. పట్టణ ం నడిబొడ్డున ఉన్న కాలనీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంటోంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఏ వైపూ వర్షపు నీరు పోయే అవకాశం లేకపోవడంతో వర్షపు నీరు మొత్తం పొంగి ఇళ్లలోకి వచ్చి చేరుతుంటుంది.
శాశ్వత పరిష్కారం కోసం భారీ ప్రణాళిక
= వర్షపు నీటి ముంపు నుంచి పట్టణాన్ని శాశ్వతంగా రక్షించేందుకు మున్సిపల్ అధికారులు గతంలో భారీ ప్రణాళికను రూపొందించారు. దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.
= దీని ప్రకారం మున్సిపాలిటీలోని భారీ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి వర్షపు నీటిని మళ్లించాలనేది ప్రణాళిక.
= పట్టణం మొత్తం మీద 60 కిలోమీటర్ల మేర ఈ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాల్సి ఉంది. ప్రధాన కాలనీలతో పాటు, లోతట్టు ప్రాంతాలను కలుపుతూ భారీ డ్రైనేజీ వ్యవస్థను చేపట్టి పట్టణంలో నుంచి వచ్చే వర్షపు నీటి ఇటు ఓవీ రోడ్డు వైపు ఉన్న వాగులోకి, అలాగే కొండముడుసుపాలెం వద్ద ఉన్న ఎర్రవాగులోకి మళ్లించే విధంగా రూపకల్పన చేశారు.
= గతంలో మున్సిపల్‌శాఖ మంత్రిగా నియోజకవర్గం నుంచి మహీధర్‌రెడ్డి ఉండడంతో దాదాపు నిధులు విడుదలైనట్టేనని అంతా భావించారు. ఎన్నికలకు ముందే నిధులు విడుదలవుతాయని ప్రచారం సాగింది. అధికారులు కూడా అదే ఆశతో ఉన్నారు. అయితే అప్పట్లో బ్రేక్ పడ్డ ఈ పథకం ప్రస్తుతం ముందుకు కదిలే పరిస్థితి కానరావడం లేదు.
= ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం లేకపోవడమే ఇందుకు కారణం. ఈ పథకానికి సంబంధించి ఫైల్ పూర్తిగా రద్దు చేసినట్లు సమాచారం. రూ.100 కోట్లు విలువ చేసే ఈ పథకానికి ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఫైల్‌ను రద్దు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పట్టణ వాసుల వర్షపు నీటి ముంపు సమస్యకు ఇప్పట్లో పరిష్కారం లేనట్లే.