
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘అన్నా.. మా ఉద్దాన ప్రాంతంలోనే బస చేశావు.. నూతన సంవత్సర వేడుకలు ఇక్కడే జరుపుకున్నావు.. మా ప్రాంతానికి పండగ తెచ్చావు.. ఇక సీఎంగా మళ్లీ మా ప్రాంతానికి వచ్చి అధ్వానంగా మారిన ఈ ఉద్దానాన్ని ఉద్ధరించు...అన్నా..’’ అంటూ ఒంకులూరుకు చెందిన జీవిత ఆకాంక్ష..
‘అయ్యా...కొడుకుల్లా పెంచుకున్న కొబ్బరి చెట్లన్నీ తిత్లీ తుపానుతో కూలిపోయాయి. చంద్రబాబు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. నువ్వొచ్చి మాలాంటి బాధితులకు అండగా నిలవాలయ్యా...’’ అంటూ బిడిమికి చెందిన జుత్తు మోహనరావు ఆవేదన.
‘రైతుల సంక్షేమం కోసం పోరాడితే మాపై దేశద్రోహం తరహాలో కేసులు బనాయించి ప్రజా సంఘాలను అణచి వేసేయాలని ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తోందన్నా... మీరు సీఎం అయ్యాక..న్యాయం చేయండన్నా’ అంటూ బహాడపల్లికి చెందిన ప్రజాసంఘ నేత దుర్యోధన విన్నపం. వీరందరిదీ ఒకటే ఆకాంక్ష. రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రానున్న ఎన్నికల్లో సీఎం కావాలని. మంగళవారం పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర రాష్ట్రంలో నవ ‘పథానికి’ అడుగులు వేసేలా సాగింది. కొత్త ఆశలు చిగురించేలా వచ్చిన కొత్త సంవత్సరాన బాధితుల కళ్లల్లో ఆనందాలు నింపేందుకు, కొండంత అండగా భరోసా ఇస్తూ యాత్ర సాగింది. ఈ ప్రాంతంలో విధ్వంసం సృష్టించిన తిత్లీ తుపానుతో సర్వం కోల్పోయిన బాధితుల కళ్లల్లో జగనన్న ఇస్తున్న భరోసా కొత్త కొత్త ఆశలు నింపింది.
నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ
2019 ఏడాది ప్రారంభం కావడంతో మంగళవారం నూతన సంవత్సర వేడుకలు ప్రజాసంక ల్పయాత్రలో ప్రత్యేకంగా కనిపించాయి. వజ్రపుకొత్తూరు మండలం డెప్పూరు క్రాస్ వద్ద యాత్ర ప్రారంభం కాగా, అంతకుముందు శిబిరం లోపల రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు భూమన కరుణాకరరెడ్డి, రెడ్డి శాంతి, రెడ్డి నాగభూషణం, శ్రీకా కుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, పలాస సమన్వయకర్త సీదిరి అప్పలరాజు తదితరులంతా ముందుగా జగన్‌కు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు తెలి యజేశారు. తర్వాత ప్రారంభమైన యాత్రలో దారిపొడవునా రాష్ట్రం నలుమూలల నుంచి కీలక నేతలు జగన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే యాత్రలో పలు గ్రామాల జనమంతా ఎంతో ఉత్సాహంగా జగన్‌కు విషెస్ చెప్పారు. అరుదైన జ్ఞాపకంగా జగన్‌తో సెల్ఫీలు దిగారు. దారిపొడవునా పలు పాఠశాలల విద్యార్ధులు రోడ్డెక్కి జగనన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పాదయాత్ర సాగిందిలా
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా మంగళవారం వైఎస్ జగన్ పలాస నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా సాగింది. కొత్త ఏడాది ప్రారంభం కావడంతో ఈ ఉత్సాహం రెట్టింపైం ది. బాహడపల్లి, నారాయణపురం గ్రామాల్లో జగనన్నకు పూలబాటలు వేశారు. అలాగే అడుగడుగునా జనం శుభాకాంక్షలు తెలుపుతూనే తమ సమస్యలను జగనన్నకు వివరించారు. ముఖ్యంగా తిత్లీ తుపాను ప్రభావంతో జరిగిన నష్టాన్ని, నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ‘తిత్లీ సహా యం’ పేరిట చేసిన నాటకాలను, అక్రమాలను పూసగుచ్చినట్లుగా వివరించారు. ఈ యాత్రలో భాగంగానే నారాయణపురం కూడలి వద్ద దివంగత మాజీ ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు.
అలాగే పలు గ్రా మాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం వజ్రపుకొత్తూరు మండలం డెప్పూరు క్రాస్ నుంచి యాత్ర ప్రారంభించి, మం దస మండలం నారాయణ పురం వరకు సాగింది. మార్గమధ్యలో పలువురు బాధితులతో మాట్లాడుతూ పలు పంట నష్టాలను స్వయంగా పరిశీలించిన జగన్, ఈ మేరకు బాధితులందరికీ న్యాయం చేస్తానని ప్రకటించారు. అలాగే తిత్లీలో కొబ్బరి చెట్టుకు రూ.3 వేలు, జీడి తోట హెక్టార్‌కు రూ.50 వేలు చెప్పున అందజేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో బహాడపల్లి గ్రామంలో ధ్వంసమైన కొబ్బరి తోటను జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు ప్రజాసంఘాలు, రైతు సంఘాల ప్రతినిధులు జగన్‌ను కలిసి, తమపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలపై వివరించారు.
దీనిపై జగన్ స్పందిస్తూ తమ ప్రభుత్వం అ«ధికారంలోకి రాగానే రైతులు, రైతు సంఘ నేతలపై బనాయించిన అక్రమ కేసులను తప్పకుండా ఎత్తివేయిస్తానని హామీ ఇవ్వడంతో రైతు సంఘ నేతలు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు మహిళా జీడి కార్మికులు కూ డా జగన్‌ను కలిసి తమకు కిలో జీడిప్పుకు రూ. 23.70 వేతన కూలీగా జీడి పరిశ్రమల యాజమాన్యాలన్నీ ఇస్తున్నారని, దీన్ని కనీసంగా రూ.30 చేయాలని కార్మికులు జగన్ వద్ద విన్నవించారు. అలాగే జీడి పనులు చేయడంతో చేతి వేలి రేఖలు పూర్తిగా అరిగిపోతున్నాయని, దీంతో పింఛను కోసం బయోమెట్రిక్ అవ్వడం లేదంటూ వాపోయారు. దీనిపై స్పందిస్తూ జీడి కార్మికులకు కార్మిక సంక్షేమ చట్టాలతో పాటు వైద్యం ఇతరత్రా సమస్యలను పరిష్కరించేలా చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీనిపై జీడి పరిశ్రమ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.
పాల్గొన్న నేతలు
ప్రజాసంకల్పయాత్రలో పలువురు నేతలు, ము ఖ్య కార్యకర్తలు జగన్‌ను కలిసి ఆయనతో కలిసి అడుగులో అడుగులు వేశారు. శ్రీకాకుళం, విజయనగరం రీజనల్ కోఆర్టినేటర్ భూమన కరుణాకరరెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు తలశిల రఘురాం, రెడ్డి శాంతి, రెడ్డి నాగభూషణరావు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల నియోజకవర్గాల సమన్వయకర్తలు సీదిరి అప్పలరాజు, పేరాడ తిలక్, గొర్లె కిరణ్‌కుమార్, రాష్ట్ర సిఈసి సభ్యుడు అంధవరపు సూరిబాబు, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు చింతాడ మంజు, పలాస పిఎసిఎస్ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్ (బాబా), మున్సిపాల్టీ ఫ్లోర్ లీడర్ దువ్వాడ శ్రీకాంత్, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయ, జిల్లా పార్టీ వాణిజ్య విభాగ అధ్యక్షుడు కోణార్క్ శ్రీను, పార్టీ నేతలు హనుమంతు కిరణ్‌కుమార్, జుత్తు ధనలక్ష్మి, జుత్తు కృష్ణమూర్తి, జుత్తు నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం నియోజకవర్గంలోకి ప్రవేశం నేడు
ప్రజాసంకల్పయాత్ర బుధవారంతో పలాస నియోజకవర్గం పరిధిలో ముగియనుంది. అనంతరం ఉదయమే ఇచ్ఛాపురం నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించనుంది. పాదయాత్ర తుది లక్ష్య స్థానమైన ఇచ్ఛాపురం నియోజకవర్గంలోకి జగన్ అడుగుపెట్టనున్నారు. యాత్రలో భాగంగా బుధవారం హరిపురం, అంబుగాం వరకు యాత్ర సాగించి పలాస నియోజకవర్గాన్ని ముగించనున్నారు. అనంతరం ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలోని సోంపేట మండలం రాణిగాం నుంచి యాత్ర సాగనుంది. ఈ మేరకు ఆయా నియోజకవర్గ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.