ఆత్మకూరురూరల్ : అన్నదాత అవసరం కన్నా.. టీడీపీ నేతలకు ఆధిపత్యమే ముఖ్యమైంది. ఒక పక్క చేతికందే దశలో ఉన్న పంటలు సాగునీటి కొరత కారణంగా ఎండిపోతుంటే.. మరో పక్క తమకు తెలియకుండా ఎత్తిపోతల నీటి పథకాన్ని ఎలా ప్రారంభిస్తారంటూ ఇరిగేషన్ అధికారులను దబాయించి మరీ సాగునీటి విడుదలకు మోకాలడ్డు వేసిన పరిస్థితి మండలంలోని మురగళ్లలో నెలకొంది. దీంతో గ్రామ రైతాంగం సాగునీటి కష్టాలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో రూ.8.7 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసింది.
నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి పైపులైన్ల ద్వారా పెన్నానది నీటిని గ్రామ చెరువులోకి తరలించేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం పూర్తయితే తమ భవిష్యత్ కూడా మారుతుందని ఆశించి రైతాంగం తమ వంతుగా శ్రద్ధ వహించి త్వరగా నిర్మాణం పూర్తయ్యేందుకు కృషి చేశారు. అధికారులు పలుమార్లు పరిశీలించి సూచనలు చేశారు. 20 రోజుల క్రితం ఏపీఎస్‌ఐడీసీ జేఎండీ, ఇతర ఉన్నతాధికారులు స్కీమ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో స్కీమ్ ప్రారంభం చేస్తామని ప్రకటించారు.
సరిగ్గా ఇదే సమయంలో అధికార పార్టీ నాయకులు రంగ ప్రవేశం చేశారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి తమ ప్రమేయం లేకుండా మాట మత్రమైనా చెప్పకుండా స్కీమ్‌ను ఎలా ప్రారంభిస్తారని గ్రామస్తులను, అధికారులపై శివలెత్తారు. జిల్లా మంత్రి, సంబంధిత శాఖ మంత్రి వచ్చి ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తారని, అప్పటి వరకు వేచి ఉండాలని రైతులకు తెగేసి చెప్పి నీటి విడుదలకు మోకాలడ్డుకున్నారు. నెల క్రితమే స్కీమ్ నిర్మాణం పూర్తయినా, అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినా ప్రారంభాన్ని టీడీపీ నాయకులు అడ్డుకోవడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులకు తీరేదెప్పుడో.. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో అంటూ రైతులు నిట్టూరుస్తున్నారు.
టీడీపీ ఆధిపత్యం.. రైతుకు శాపం
Published Tue, Jan 27 2015 1:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement