డీఈతో గొడవకు దిగిన పుట్లూరు శీను
సాక్షి, డోన్: పట్టణానికి చెందిన టీడీపీ నేత పుట్లూరు శీను వీరంగం సృష్టించాడు.పెద్దొంక ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన మైనర్ ఇరిగేషన్ అధికారులపై శివాలెత్తాడు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అటకాయించడమే కాకుండా తన అనుచరులతో కలిసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పట్టణ శివారులోని వెంకటనాయినిపల్లె రస్తా పక్కన గల పెద్దొంక నీటి పరివాహక ప్రాంతాన్ని కొందరు టీడీపీ నాయకులతో పాటు పుట్లూరు శీను కుటుంబ సభ్యులు కూడా ఆక్రమించారనే అభియోగాలున్నాయి. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు గత 15రోజులుగా పెద్దొంక, బోగందాని వంక నీటి పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను మైనర్ ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు.
ఈ క్రమంలోనే మైనర్ ఇరిగేషన్ డీఈ విద్యాసాగర్, ఏఈ నారాయణ, తహసీల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం సాయంత్రం శీను పొలంలో కొలతలు వేసేందుకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అతను తన కుటుంబ సభ్యులను వెంటదీసుకుని వెళ్లి అధికారులపై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ విషయంపై మైనర్ ఇరిగేషన్ డీఈ విద్యాసాగర్ సోమవారం రాత్రి 8గంటలకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment