ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఏపీ ఎన్‌జీఓ సంఘ రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒంటెత్తు పోకడలతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సంఘ ప్రస్తుత అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబును ఓడించేందుకు వైరి వర్గాలన్నీ ఏకమయ్యాయి. ఎన్‌జీఓ సంఘ అధ్యక్షునిగా నిరంకుశంగా వ్యవహరిస్తున్న అశోక్‌బాబుకు చెక్ పెట్టేందుకు మొట్టమొదటగా ప్రకాశం జిల్లాలోనే తిరుగుబాటు మొదలైంది. ఎన్‌జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు, పూర్వ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ బషీర్, ఎన్‌జీఓ సంఘ అధ్యక్ష పదవి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. అశోక్‌బాబుకు వ్యతిరేక ప్యానెల్‌లో అధ్యక్ష పదవికి బషీర్ ఆదివారం హైదరాబాద్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. బషీర్‌ను బరిలోకి దించేందుకు అశోక్‌బాబు వ్యతిరేకవర్గమంతా ఏకగ్రీవంగా నిర్ణయించింది. బషీర్ వర్గానికి ఏపీ ఎన్‌జీఓ సంఘ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోపాలరెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి సుబ్బరామన్, సత్యనారాయణ మరి కొందరు మద్దతు తెలుపుతున్నారు. బషీర్ అనుకూల వర్గ నాయకులు నాలుగు రోజులుగా సీమాంధ్ర ప్రాంతాల్లోకి వివిధ జిల్లాలో పర్యటించి మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. ఎన్నికల్లో గెలుపుపై బషీర్‌వర్గం ధీమాగా ఉంది.
ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర శాఖ పరిధిలో మొత్తం 16 జిల్లా యూనిట్లున్నాయి. ఈ యూనిట్లలోని పాలకవర్గ సభ్యులందరికీ ఓటు హక్కు ఉంటుంది. అదే విధంగా ఈ 16 జిల్లా యూనిట్లలోని తాలూకాల అధ్యక్ష, కార్యదర్శులకు రాష్ట్ర నూతన పాలకవర్గ ఎన్నికల్లో ఓట్లున్నాయి. అంటే మొత్తం సుమారు వెయ్యి మంది ఓటర్లున్నారు. 8 యూనిట్లు పూర్తిగా, మరో యూనిట్‌లో సగం బలం ఇప్పటికే కూడగట్టామని ఎన్నికల నాటికి తమ బలం మరింత పెరుగుతుందని బషీర్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది.
బషీర్‌కు మద్దతుగా రాజధానికి పయనం
ఏపీ ఎన్‌జీఓ సంఘ అధ్యక్ష పదవికి ఆదివారం నామినేషన్ దాఖలు చేయనున్న బషీర్‌కు మద్దతుగా జిల్లా నుంచి ఎన్‌జీఓ నాయకులు బస్సుల్లో హైదరాబాద్ తరలివెళ్లారు. ఎన్నికల అధికారిగా జిల్లా ఎన్‌జీఓ సంఘ మాజీ అధ్యక్షుడు చెల్లి హనుమంతరావు వ్యవహరిస్తున్నారు. బషీర్ వర్గానికి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లావాసి బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా మద్దతు తెలిపారు. మరికొన్ని ప్రభుత్వ శాఖల రాష్ట్ర సంఘాలు కూడా బషీర్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్థానిక ప్రకాశం భవనం నుంచి శనివారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో ఎన్‌జీఓలు హైదరాబాద్‌కు తరలివెళ్లారు.
ఎన్‌జీఓ అధ్యక్ష బరిలో బషీర్
Published Sun, Dec 22 2013 4:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement