యూపీఏకు ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవాలి: అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు వెంటనే యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షులు అశోక్‌బాబు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రక్రియ ఆగిపోవాలంటే కేంద్ర ప్రభుత్వ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఎంపీలు రాష్ట్రపతిని కలిసి మద్దతు ఉపసంహరణ లేఖలు అందజేయాలని పేర్కొన్నారు. త్వరలోనే సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక పేరును రిజిష్టర్ చేయిస్తున్నామని, తాత్కాలిక కార్యకవర్గం సోమవారం సమావేశమై చర్చించిందన్నారు.
వేదిక ద్వారా 7వ తేదీ నుంచి 15వరకూ ఆందోళన కార్యాచరణను ప్రకటించారు. జీఓఎం ఏర్పాటుకు నిరసనగా 7న జిల్లాల్లో నిరసన ర్యాలీలు, 8న సర్వమత ప్రార్థనలు, 9న మహిళల ఆధ్వర్యంలో ర్యాలీలు, 11న కొవ్వొత్తుల ర్యాలీలు, 12న భోజన విరామ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో నిరసన లు, 13న ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైళ్లు, బస్సులకు స్టిక్కర్లు అతికించడం, 14న నెహ్రూ జయంతిన విద్యార్థుల ర్యాలీలు, 15న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ర్యాలీలు, 16న భారీ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీని వేదిక, ఇతర వివరాలు తర్వాత వెల్లడిస్తామన్నారు. సమావేశంలో చలసాని శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీఓ సంఘం ప్రతినిధులు చంద్రశేఖరరెడ్డి, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, ప్రసాదరావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.