రాజకీయ దురుద్దేశంతోనే అఖిల పక్ష భేటీ:అశోక్ బాబు
అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తే సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహారించిందని ఆయన ఆరోపించారు. విభజన అంశంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహర తీరును ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని అశోక్ బాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఏపీ ఎన్జీవోలు చేపట్టిన సమ్మెను పలుచన చేయవద్దని పలువురు నేతలకు అశోక్బాబు విజ్ఞప్తి చేశారు.
తాము చేపట్టిన సమ్మెను తత్కాలికంగా విరమించామని అంతేకాని శాశ్వతంగా సమ్మె విరమించినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తామే కనుక మాట్లాడితే ... నాయకుల చరిత్రను బయటకు తీయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అన్ని పార్టీల నిర్ణయంతోనే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ముందుకు వెళ్ల లేదని తెలిపారు. ఆర్టికల్ 370 (1) డీపై సంగతి తెలితేనే విభజనపై స్పష్టత వస్తుందన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే అఖిల పక్ష భేటీని మరోసారి కేంద్రం ఏర్పాటు చేసిందని అశోక్ బాబు ఆరోపించారు.