
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఏవిధంగా ఇష్టారాజ్యంగా నిబంధనలను అతిక్రమిస్తోందో ఎన్జీటీ గుర్తించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ పారిక్ తెలిపారు. రాజధాని ప్రాంతంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఉల్లంఘనలను గుర్తించి పర్యావరణ పరిరక్షణకు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. వరద ముంపు ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం సీడ్ క్యాపిటల్‌గా ఎంపిక చేసిందని, మూడు పంటలు పండే భూముల్ని నాశనం చేస్తూ నిర్మాణాలు చేపడుతోందని విచారణ సందర్భంగా ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లినట్టు పారిక్ తెలిపారు.
అలాగే కృష్ణానది కరకట్టను దెబ్బతీస్తూ కొండవీటి వాగు ప్రవాహ దిశను మార్చే ప్రయత్నాలు చేసిందన్నారు. రాజధాని ప్రాంతంలో ఏవిధంగా ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడుతోందో అన్ని వివరాల్ని ఎన్జీటీ ముందుంచామన్నారు. వీటిని నిశితంగా పరిశీలించిన ట్రిబ్యునల్ తాము లేవనెత్తిన అంశాలతో ఏకీభవించి తీర్పు ఇచ్చిందన్నారు. కరకట్టను దెబ్బతీయకుండా, ముంపు ప్రాంతాల్లో, కృష్ణా నది దిశగా నిర్మాణాలు చేయకూడదని, పర్యావరణ అథారిటీ జారీ చేసిన నియమ నిబంధనలను తూచా తప్పక పాటించాలని తీర్పులో రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు.
రాజధాని నిర్మాణాన్ని సూపర్‌వైజరీ కమిటీ పర్యవేక్షిస్తుంది..
జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన తీర్పు మేరకు రాజధాని నిర్మాణాన్ని సూపర్‌వైజరీ కమిటీ పర్యవేక్షిస్తుందని ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. ఎన్జీటీ శుక్రవారం తీర్పు ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.