ఆశించాను కానీ... మంత్రి పదవి దక్కలేదు
సాక్షి, కాకినాడ : ‘‘చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి వస్తుందని నాతో పాటు నా కేడర్, నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆశించారు. ఆ ఆశ నిరాశైంది. ఆ అసంతృప్తితోనే ప్రమాణస్వీకారానికి వెళ్లకుండా వెనక్కి వచ్చేశాను’’ అని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అన్నారు. మంత్రి పదవి రాలేదని తాను ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోమవారం కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు...
నాలుగు సార్లు గెలిచినా...
ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారని, ఇవాళ కాకపోయనా, రేపైనా తనకు తగిన గుర్తింపు లభిస్తుందని పార్టీ కేడర్‌కు నచ్చజెప్పానన్నారు. ‘పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో తాను ఆరుసార్లు తలపడితే బోసు గెలుపొందిన రెండు సార్లూ ఆయనకు కేబినెట్‌లో చోటుదక్కిందని, తాను నాలుగు సార్లు గెలుపొందినా మంత్రి పదవి లభించకపోవడం అసంతృప్తిమిగిల్చిందన్నారు.
అవకాశం ఇవ్వమని కోరతా...
మంత్రివర్గ విస్తరణలోనైనా తనకు అవకాశం కల్పించాలని బాబును కోరతాన్నారు. జిల్లాలో ఎస్సీలకు రిజర్వైన అమలాపురం ఎంపీతో సహా మూడు అసెంబ్లీ నియోజక వర్గాల ప్రజలు టీడీపీకీ పట్టంకట్టినా కేబినెట్‌లో వారికి కనీస ప్రాతినిధ్యం కల్పించకపోవడం ఆ సామాజిక వర్గీయుల్లోనూ అసంతృప్తిని రగిల్చిందన్నారు. త్వరలోనే వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. రుణమాఫీపై విధివిధానాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకే కమిటీ వేశారన్నారు. కాపులను బీసీల్లో చేర్చే విషయంలో చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని విశ్వసిస్తున్నట్టు చెప్పారు.