వెంకన్న దర్శనానికి విరామం | No Darshan In Tirumala Tirupati Temple Amid Coronavirus | Sakshi
Sakshi News home page

128 ఏళ్ల తర్వాత నిలిచిపోనున్న దర్శనం

Published Fri, Mar 20 2020 10:15 AM | Last Updated on Fri, Mar 20 2020 10:29 AM

No Darshan In Tirumala Venkateswara Temple Amid Coronavirus - Sakshi

ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావం కలియుగ వైకుంఠానికి చేరింది. 128 ఏళ్ల తర్వాత ఏడుకొండలవాడి దర్శనం భక్తులకు నిలిచిపోనుంది. నిత్య కల్యాణం పచ్చతోరణంగా విలసిల్లే వడ్డీకాసులవాడి వైభవం ఏకాంతంగా సాగనుంది. లక్షలాది భక్తుల గోవిందనామస్మరణలతో మార్మోగే ఆపదమొక్కులవాడి సన్నిధి మూగబోనుంది. 1892వ సంవత్సరంలో శ్రీవారి ఆలయ జియ్యంగార్లు, అప్పటి మహంతుల మధ్య తలెత్తిన వివాదం వల్ల 2రోజులపాటు వెంకన్న దర్శనం భక్తులకు కరువైంది. అయితే ఇప్పటి కరోనా వైరస్‌ విజృంబణతో తిరుమలేశుని వీక్షించేందుకు భక్తులకు వారం రోజులు పట్టనుంది.

సాక్షి, తిరుమల : తిరుమలలో శ్రీవేంకటేశ్వస్వామి దర్శనానికి భక్తులను వారంపాటు అనుమతించకూడదని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలియజేశారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశారు. కల్యాణోత్సవాన్ని సైతం ఏకాంతంగా జరిపించేందుకు నిబంధనల్లో పలు మార్పులు తీసుకువచ్చారు. నిత్య సేవల్లో భాగమైన వసంతోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ, సహస్ర కలశాభిషేకం సేవలను టీటీడీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు కూడా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా టైంస్లాట్‌ ప్రకారం నేరుగా శ్రీవారిని దర్శించుకునే ఏర్పాటు చేశారు.

అన్నప్రసాద సముదాయంలో కూడా నలుగురు భోజనం చేసే స్థలంలో ఇద్దరు మాత్రమే కూర్చుని తినేలా దూరం పెంచారు. భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో ప్రతి 2గంటలకు ఒకసారి శుభ్రం చేయిస్తున్నారు. అలిపిరి వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. నడకమార్గాల్లో అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా కరోనా వైరస్‌ లక్షణాలతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక భక్తుడు తిరుమలకు చేరుకున్నాడు. 110మంది బృందంతో కలిసి శ్రీశైలం దర్శనానంతరం శ్రీవారి సన్నిధికి వచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ భక్తుడిని తిరుమలలోని అశ్వని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత తిరుపతి రుయాకు తీసుకెళ్లి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన టీటీడీ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు.

ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు విచ్చేసే భక్తులందరినీ తనిఖీ చేసే అవకాశం లేకపోవడంతో శ్రీవారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అలిపిరిలో తిరుమలకు వెళ్లేదారిని మూసేయించారు. ఇప్పటికే కొండపై ఉన్న భక్తులను దర్శనం పూర్తి చేయించి కిందకు దించే ఏర్పాట్లు చేపట్టారు. నడకదారుల్లో నుంచి కూడా భక్తులను అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేశారు. అన్నదాన సత్రం, కల్యాణకట్టను మూసేయనున్నారు.  దీంతో  కొన్ని రోజులపాటు శ్రీవారి దర్శనానికి భక్తులు దూరం కాబోతున్నారు.

కాణిపాకంలో సేవలన్నీ రద్దు 
కాణిపాకం (యాదమరి): కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం, స్వామివారి ఆలయ అనుబంధ ఆలయాలు అయిన మణికంఠేశ్వర స్వామి ఆలయం, శ్రీ వరదరాజుల స్వామి ఆలయాల్లో అన్ని సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ దేముళ్లు తెలిపారు.  గురువారం ఆయన కాణిపాకంలో విలేకర్లతో మాట్లాడుతు బయట దేశాలలో కరోనా వైరస్‌ ఉన్నందున ఆక్కడ నుంచి భక్తులు స్వామివారి దర్శనార్థం విచ్చేస్తున్నారు. దీనిపై కరోనా వైరస్‌ను అరికట్టడానికి ఆలయంలో అర్జిత సేవలన్నింటినీ ఈ నెల 20 నుంచి 31 వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అలాగే స్వామివాకిరి పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement