సాక్షి, తిరుమల: కరోనా వైరస్ తిరుమలలో రోజురోజుకు విజృంభిస్తోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా శ్రీవారి ఆలయ జీయర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 170 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. 18 మంది అర్చకులు, 100 మంది సెక్యురిటీ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. 20 మంది పోటు సిబ్బంది, కల్యాణకట్టలో ఇద్దరికి కరోనా సోకినట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుమలలో పరిస్థితులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు.
టీటీడీ ఈవో, అదనపు ఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. శ్రీవారి దర్శనాల నిలిపివేతపై సాయంత్రం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కరోనా వైరస్ సోకిన జీయర్ స్వాములు, అర్చకులతో పాటు ఇక మిగిలిన టీటీడీ సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. గురువారం జరిగిన సమావేశంలో 60 ఏళ్లు నిండిన అర్చకులకి విధుల నుంచి సడలింపు ఇచ్చామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అర్చకులకి ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంటే దర్శనాలు కూడా ఆపివేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment