జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులోని క్షయవార్డులో బెడ్లు కూడా సరిగా లేక పోవడంతో రోగులు వార్డులో ఉండి చికిత్స చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు.
సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులోని క్షయవార్డులో బెడ్లు కూడా సరిగా లేక పోవడంతో రోగులు వార్డులో ఉండి చికిత్స చేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బెడ్లు తుప్పుపట్టి పోవడంతో తమ వెంట తెచ్చుకున్న బెడ్‌షీట్లతో నేలపై నిద్రిస్తున్నారు. వార్డు మొత్తం కంపు కొడుతోంది. వార్డులోని ఫ్లోరింగ్ పూర్తిగా దెబ్బతిన్నది. వార్డు పరిసరాలలో శానిటేషన్, గార్డెనింగ్ లోపించడంతో పిచ్చిమొక్కలు పెరిగి పందులు తిరుగుతున్నాయి. వార్డులో ప్రస్తుతం ఆరుగురు రోగులు ఉన్నారు. ఆస్పత్రిలో కనీస వసతులు లేక పోవడంతో డాక్టర్లు రోగులను చేర్చుకోకుండా ఇంటి వద్దనే ఉంటూ మందులు వాడుకోవాలని సూచిస్తున్నారు. గత కొన్ని నెలలుగా వార్డులో ఉంటూ చికిత్స పొందుతున్న వారిని ప్రశ్నించగా మందులు, భోజనం తప్ప మిగతా సేవలు అందడం లేదన్నారు.
తీవ్ర సమస్యతో బాధపడుతున్న వారికి ఏదైనా అత్యవసర వైద్యం అందించాల్సి వచ్చినప్పుడు కనీసం స్ట్రెచర్ కూడా వార్డులో అందుబాటులో లేదని రోజు ఇద్దరు వైద్య సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉంటున్నారని, వారు కూడా ఉదయం మాత్రమే అందుబాటులో ఉంటున్నారన్నారు. సాయంత్రం వేళల్లో కూడా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటే బాగుంటుందని రోగులు కోరుతున్నారు. ఇక్కడికి వచ్చిన రోగులకు రోగం తగ్గక పోగా మరింత పెరిగే విధంగా పరిసరాలు తయారయ్యాయి. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే వార్డు దుస్థితికి కారణమని ప్రజలు అంటున్నారు.
మా బాధ్యత నెరవేర్చాం
క్షయ వార్డుకు సంబంధించి మేము మందులు మాత్రమే అందించగలం. డాక్టర్ల సేవలు సరిగానే అందుతున్నాయి. వార్డుకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సింది ఏపీ వైద్య విధాన పరిషత్ అధికారులే. ఈ విషయాన్ని గతంలో వారి దృష్టికి తీసుకవెళ్లాం. రోగులకు సరైన వాతావరణం కల్పిస్తే మరిన్ని సేవలు అందిస్తాం.
- జిల్లా క్షయ నియంత్రణ అధికారి పద్మ
వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి
క్షయ రోగులను వ్యాధి తీవ్రతను బట్టి ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి కుటుంబ సభ్యుల నుంచి నిరాదరణకుగురైన వారిని వార్డుల్లో ఉంచి వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు మా పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం ఉంది. రోగికి ప్రతి రోజు అరగంటపాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. పరీక్షలు చేసి వ్యాధి నయమయ్యే వరకు ఇక్కడే ఉంచుకుంటాం.
వారిని బయటకు పంపితే ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. వార్డులో వారికి కావాల్సిన బెడ్లు, ఇతర సామగ్రిని ప్రభుత్వం వెంటనే మంజూరు చేస్తే మరిన్ని సేవలు అందించే అవకాశం ఉంది. పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండేలా సిబ్బందిని నియమించాలి. వార్డుకు మరో నలుగురు సిబ్బందిని నియమించాల్సి ఉంది.
- డాక్టర్ రవీందర్‌గౌడ్, మెడికల్ ఆఫీసర్