శ్రీకాకుళం టౌన్: జిల్లాలో ప్రతి కుటుంబానికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ అందిస్తామని పాలకులు వాగ్దానం చేశారు. మూడు ఆయిల్ కంపెనీలకు చెందిన గ్యాస్ ఏజెన్సీలపరిధిలో 1.58 లక్షల గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఆరంభమైన ఈపథకం కింద నెలవారీ లక్ష్యాలను విధించారు. ఈ ఏడాది మార్చినాటికి 12.58 లక్షల కనెక్షన్లు పంపిణీ పూర్తి చేయాలని గ్యాస్ కంపెనీలను కోరింది. ఒక్కో కనెక్షన్‌కు రూ.1600 వంతున ప్రభుత్వం డిపాజిట్ చెల్లించింది. దీపం కనెక్షన్ కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి..ఆన్‌లైన్లో వీటిని అప్‌లోడ్ చేయించారు.
సుమారు రెండు లక్షల 17 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హత ఉన్న వారు 1.77 లక్షలుగా నిర్ణయించారు. వారిలో 1.58 లక్షల మందికి ఈ ఏడాది కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. లక్ష్యం చేరుకునేందుకు 1.29 లక్షలు వెరిఫికేషన్ పూర్తి చేసి నప్పటికీ అందులో కేవలం 62,715 మందికి మాత్రమే కనెక్షన్లు జారీ అయ్యాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లక్ష్యంగా 36,912 మంజూరు చేస్తే అందులో 32,599 కనెక్షన్లు పంపిణీ పూర్తి చేశారు. 4,313 కనెక్షన్లు పంపిణీ కాకుండా వెనక్కి మళ్లిపోయాయి. అలాగే అత్యధికంగా ఏజెన్సీలున్న హిందుస్తాన్ పెట్రోలియం సంస్థకు 75,438 లక్ష్యం కాగా 18,639 కనెక్షన్లు మాత్రమే పంపిణీ చేశారు. మార్చి నెలాఖారుకు 56,799 కనెక్షన్లు పంపిణీ చేయక పోవడంతో ఇవి రద్దయ్యాయి. భారత్ పెట్రోలియం కార్పోరేషన్ పరిధిలో 45,478 లక్ష్యంగా నిర్ణయిస్తే వారు కేవలం 11,477 మాత్రమే పంపిణీ చేశారు.
వారు 34,401 కనెక్షన్లు పంపిణీ చేయక పోవడంతో వెనక్కి వెళ్లిపోయాయి. దరఖాస్తుదారులు గ్యాస్ కనెక్షన్ల కోసం పడిగాపులు కాస్తుంటే కంపెనీలు, ఏజెన్సీలు, జన్మభూమి కమిటీల మధ్య సమన్వయం కుదరక 95,513 కనెక్షన్లు వెనక్కి వెళ్లిపోయాయి. దీనివల్ల దీపం లబ్థిదారులు నష్టపోయారు. కొత్తగా ఈ ఏడాది దీపం కనెక్షన్లు మంజూరు ఇంతవరకు మొదలు కాలేదు. గత ఏడాది మంజూరు చేసిన కనెక్షన్లు క్షేత్ర స్థాయికి చేర కుండానే వెనక్కి మళ్లి పోయాయి.
డీఎస్‌వో సుబ్రహ్మణ్యం ఏమంటున్నారంటే..
జిల్లాలో అర్హత ఉన్న దీపం లబ్ధిదారులు ఉన్నప్పటికీ సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల నష్టం వాటిల్లింది.. ఆన్‌లైన్ దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరిగింది. దీనికి తోడు క్షేత్రస్థాయిలో జన్మభూమి కమిటీలు పర్యవేక్షణ సమయంలో దరఖాస్తుల పరిశీలన బాధ్యత వారికి అప్పగించాం. అక్కడ వారి అనుమతించిన తర్వాత దీపం కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు మొదలు పెట్టాం. ఇంతలో ఆయిల్ కంపెనీల నుంచి మరి కొన్ని సమస్యలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకునే వీలు లేక ఈఏడాది 95 వేల గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయలేక పోయాయి. ఆ దరఖాస్తు దారులకు ఈ ఏడాది మంజూరు చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తే చర్యలు మొదలు పెడతాం.
వెలగని ‘దీపం’!
Published Thu, May 12 2016 12:41 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement