సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై ఏమాత్రం కసరత్తు (హోంవర్క్) చేయకుండా ప్రకటన చేయడం కాంగ్రెస్ ఏకపక్ష దోరణికి, చిత్తశుద్ధి లేమికి నిదర్శనమని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. ఎటువంటి అపోహలు లేకుండా రాష్ట్రాన్ని విభజించడం స్థితప్రజ్ఞులు మాత్రమే చేయగలరన్నారు. అటువంటి పని తాము మాత్రమే చేయగలమని చెప్పారు. తెలంగాణలో ఒక మాట, ఏపీలో ఒక మాట చెప్పడం కాంగ్రెస్ చేస్తుందే తప్ప బీజేపీ చేయదన్నారు.
67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం జాతీయపతాకావిష్కరణ సభ జరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ కులం, మతం, వర్గం, భాష పేరిట ప్రజలను చీలుస్తున్నారన్నారు. తెలంగాణపై జరిగినంత లోతైన చర్చ తన జీవితంలోనే చూడలేదని చిదంబరం చెబుతుంటే ఎక్కడా చర్చే జరగలేదని ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు చివరకు ముఖ్యమంత్రి కూడా చెబుతున్నారన్నారు. రాజ్యసభలో
తాను చేసిన వ్యాఖ్యల్ని అమాయకులు, చదువురాని వారు మాత్రమే తప్పుబడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నిజంగా హోంవర్క్ చేసుంటే సీమాంధ్రలో ఈ పరిస్థితి వచ్చుండేది కాదన్నారు. 2004 నుంచి 2013 వరకు ప్రక్రియ మొదలు పెట్టని కాంగ్రెస్ ఇప్పుడు లాభసాటిగా ఉంటుందని చేపట్టిందేమోనని వ్యాఖ్యానించారు. సమస్యలు నాన్చడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెడుతుందని చెప్పలేమని, ఇంతవరకు రోడ్‌మ్యాప్‌పైన్నే అవగాహన లేదన్నారు. కాంగ్రెస్ రెండింటికీ చెడ్డ రేవడిగా తయారవుతుందన్నారు.
ఆంటోనీ కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారో కాంగ్రెస్‌కు తెలియక కాదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఓ పార్టీ వేసుకున్న కమిటీకి మరోపార్టీ వాళ్లు అభ్యంతరాలు తెలుపుతారా? అని ప్రశ్నించారు. అహంకార దోరణితోనే ఏకపక్షంగా ఆ కమిటీని వేసిందన్నారు. సీమాంధ్రుల్లో నెలకొన్న భయాందోళనలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం తరఫున కమిటీ వేస్తే బాగుండేదన్నారు.
తాత్కాలిక లబ్ధికే పాకులాట...
నీతి, నిజాయితీ, సిద్ధాంతం, విధానం లేని కొందరు నేతలు భావోద్వేగాలు రెచ్చగొట్టి తాత్కాలిక ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా దేశంలో మూడో వంతు ప్రజలు దారిద్య్ర రేఖ దిగువన బతుకుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న ఆంధ్రప్రదేశ్ నేడు అన్నింటా వెనుకబడిందనారు. రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో కొందరు నేతలు వాడుతున్న చౌకబారు భాష, విమర్శలు కలచి వేస్తున్నాయని, సంయమనం పాటించాలని ప్రజల్ని కోరారు.
రాజకీయ ప్రక్షాళనకు యువకులు, మేథావులు పెద్దఎత్తున రాజకీయాల్లోకి రావాలని పిలుపిచ్చారు. దేశంలో సుస్థిర పాలన, సమర్ధనాయకత్వాన్ని అందించే పార్టీలనే ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. ప్రజాజీవనంలో నిర్వహించాల్సిన 15 కర్తవ్యాలను ఆయన ఉద్బోధించారు. దేశంలో ఆంతరంగిక కల్లోలాలు సృష్టిస్తున్న పాక్ ఓ ధూర్తదేశంగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరును ఉపయోగించుకుని ప్రజల్ని మభ్యపెడుతోందని కిషన్‌రెడ్డి చెప్పారు. సమావేశంలో డాక్టర్ కె.లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయ, డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనపై హోంవర్క్ ఏదీ?: వెంకయ్య
Published Thu, Aug 15 2013 10:01 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement