ప్రత్యేక, సమైక్య ఉద్యమాల నేపథ్యంలో టీఎన్జీవోలు, ఏపీ ఎన్జీవోలు శాంతియుతంగా నిరసనలు తెలిపితే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు.
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక, సమైక్య ఉద్యమాల నేపథ్యంలో టీఎన్జీవోలు, ఏపీ ఎన్జీవోలు శాంతియుతంగా నిరసనలు తెలిపితే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. అయితే ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా నిరసన లకు దిగితే మాత్రం ఉపేక్షించబోమన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఉద్యోగులు వారి కార్యాలయంలో శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన, ర్యాలీ తదితరాలు నిర్వహిస్తే అడ్డుకోమన్నారు.
ఆవరణ దాటి బయటకు వచ్చి నిరసనలు, ర్యాలీలు చేసినా, ఘర్షణలకు అవకాశం ఉందని అనుమానం వచ్చినా వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ముందస్తు అరెస్టులు చేస్తామని చెప్పారు. విద్యుత్‌సౌధలో జరుగుతున్న ఆందోళనల్లో బయటి వ్యక్తులు వస్తున్నారని సమాచారం అందిందని, దీనిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సచివాలయం లోపల భద్రత బాధ్యతలు స్పెషల్ ప్రొటెక్షన్స్ ఫోర్స్ చూసుకుంటుందని, అక్కడ జరుగుతున్న ర్యాలీలు తదితరాలపై వారే స్పందించాలన్నారు. అక్కడి నుంచి ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు జోక్యం చేసుకుంటారని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ఇటీవల అధిక జరిమానా విధించింది ప్రభుత్వ ఆదేశాల మేరకేనని సీపీ స్పష్టం చేశారు.