సాక్షి, మంచిర్యాల :
గ్రామ పంచాయతీల్లో అంధకారం అములుకోనుంది. ఇప్పటికే పన్నులు వసూలుకాక అనేక గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి. ఇంతకాలం విద్యుత్ భారం మోస్తూ వస్తున్న ప్రభుత్వం ఇకపై ఆ భారాన్ని పంచాయతీలపై వేయాలని నిర్ణయించింది. దీంతో తాగునీటి పథకాలకు, వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ చార్జీలు పంచాయతీలే చెల్లించాల్సి ఉంటుంది. ఇక వీధుల్లోని లైట్లు వేయాలంటే పంచాయతీలు ఆలోచించాల్సిందే. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలు రెండు వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించింది.
2009 నుంచి ప్రభుత్వమే చెల్లిస్తోంది..
2008 సంవత్సరానికి ముందు విద్యుత్ బిల్లులు పంచాయతీలే చెల్లించేవి. ప్రభుత్వాలు పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు సరిగ్గా మంజూరు చేయకపోవడం, పన్నులు కూడా వసూలు కాకపోవడంతో బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. కొన్నిచోట్ల పంచాయతీలు విద్యుత్ చార్జీలు, బకాయిలు చెల్లించకపోవడంతో కరెంట్ కట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే హైదరాబాద్‌లో అధిక శాతం బకాయిలు 2009, 2011లో చెల్లించింది.
పంచాయతీల బకాయిలే అధికం
జిల్లాలో 27మేజర్.. 839 మైనర్‌లతో కలుపుకు ని 866గ్రామ పంచాయితీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీల పరిధిలో ఆస్తి, నీటి, రెవెన్యూ ఇతరాత్ర పన్నులు వసూలు చేసుకున్న తర్వాత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీల కు కలిపి ఒకేసారి విద్యుత్ బిల్లులు చెల్లిస్తోంది. పన్ను తక్కువగా వసూలు కావడం, బకాయిలు ఎక్కువగా ఉండడంతో ఇకపై విద్యుత్ చార్జీల భారాన్ని ఆయా పంచాయతీలపైనే వేయాలని నిర్ణయించింది. మరోపక్క.. క్షేత్రస్థాయిలో ప న్నులు వసూలు కాక.. ప్రస్తుతం పేరుకుపోయి న కరెంట్ బిల్లులు చెల్లించడం పంచాయతీలకు తలకుమించిన భారంగా మారింది.
ఈ ఏడాది అక్టోబర్ వరకు ఆదిలాబాద్ పరిధిలో మైనర్ పంచాయతీల్లో రూ.8,65,77,000 ఉండగా మే జర్ జీపీలో రూ. 4,63,65,00 బకాయి ఉంది. నిర్మల్ పరిధిలోని మైనర్ జీపీల్లో 3,77,01,000, మేజర్ జీపీలో రూ. 1,61,72,000, భైంసా పరి ధిలో మైనర్ జీపీల్లో రూ.3,92,81,000, మేజర్ జీపీల్లో రూ. 1,82,37,000, మంచిర్యాల పరిధిలోని మైనర్ జీపీల్లో రూ.6,49,25,000, మేజర్ 2,91,50,000, కాగజ్‌నగర్ పరిధిలోని మైనర్ జీపీల్లో రూ.11,39,77,000, మేజర్ జీపీల్లో రూ. 2,20,92,000 బకాయి ఉంది.
పన్నుల వసూలుకు కార్యదర్శుల కొరత
జిల్లావ్యాప్తంగా 866 గ్రామ పంచాయతీల్లో కేవ లం 225 మంది మాత్రమే రెగ్యులర్ కార్యదర్శులున్నారు. 641పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 571 స్థానాల్లో ఇన్‌చార్జీలు ఉన్నారు. ఇన్‌చార్జీల స్థానా ల్లో పన్నుల వసూళ్లు పూర్తిగా నిలిచాయి. ఈ ఆర్థిక సంవత్సరం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో నుంచి రూ. 16కోట్లు పన్నుల రూపంలో రావాల్సి ఉండగా.. ఇప్పటివ రకు కేవలం రూ.5 కోట్లు మాత్రమే వసూల య్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిల్లుల చెల్లింపు ఎలా సాధ్యమని కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య వివరణ ఇస్తూ.. ‘గ్రామాల్లో పన్నులు వసూలు కాని విషయం వాస్తవం. పంచాయతీలపై కరెంట్ చార్జీల భారం వేస్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. కానీ అధికారికంగా ఇంత వరకు పూర్తి వివరాలు తెలియదు.’ అన్నారు.
భారం మోపొద్దు..
మా పంచాయతీ పరిధిలో 3 వేల పైచిలుకు జనాభా ఉంది. కానీ వసూలయ్యే పన్నులు మాత్రం రూ.40 వేల లోపే. ఇప్పటికే నిధులు లేక గ్రామాల్లో ఆశించిన అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నాం. ఇప్పుడు కరెంట్ చార్జీల భారం కూడా మా పైనే మోపితే.. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ప్రభుత్వం స్పందించి ఈ విషయంలో పునరాలోచించాలి.
- డేగబాపు, వేంపల్లి సర్పంచి,
మంచిర్యాల మండలం
ఇక పల్లెల్లో చీకట్లు
Published Thu, Dec 26 2013 2:31 AM | Last Updated on Wed, Sep 5 2018 1:47 PM
Advertisement
Advertisement