ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల రక్త, మూత్ర పరీక్షలను నిర్వహించే మల్టీల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.
మోర్తాడ్, న్యూస్‌లైన్ :
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల రక్త, మూత్ర పరీక్షలను నిర్వహించే మల్టీల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. డిప్లోమా ఇన్ మల్టీ పర్పస్ ల్యాబ్ టెక్నీషియన్(డీఎంఎల్‌టీ) శిక్షణ పొందిన అభ్యర్థులతో కాకుండా ఎలాంటి అనుభవం, శిక్షణలేని ఎంపీహెచ్‌ఏలకు ల్యాబ్ టెక్నీషియన్లుగా అదనపు బాధ్యతలను అప్పగించారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ముప్పై పడకల ఆస్పత్రులు 52 వరకు ఉండగా ఇందులో 36 ఆస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఎంఎల్‌టీలతో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. హెచ్‌ఐవీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్త, మూత్ర పరీక్షలను నిర్వహించి వ్యాధి తీవ్రతను గుర్తిస్తారు. అంతేకాక మహిళలు గర్భందాల్చితే వారికి కూడా మూత్ర పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేస్తారు. వీటితోపాటు ఇతర వ్యాధులకు సంబంధించిన రోగులకు రక్తం, మూత్ర పరీక్షలను నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేసేవారు.
డీఎంఎల్‌టీలు నిర్ధారణ పరీక్షలు చేసిన తరువాతనే వైద్యులు చికిత్స నిర్వహిస్తారు. డీఎంఎల్‌టీలుగా పని చేసినవారికి పదోన్నతి లభించడం, ఉద్యోగ విరమణ చేయడంతో జిల్లాలో అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీ అయ్యాయి. దీంతో రోగులకు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించేవారు కరువయ్యారు. దాదాపు 12 సంవత్సరాలుగా ఎంపీహెచ్‌ఏలుగా కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న వారిలో 36 మందిని ఎంపిక చేసిన జిల్లా అధికారులు ల్యాబ్ టెక్నీషియన్లుగా అదనపు బాధ్యతలను అప్పగించారు. వీరికి ల్యాబ్ టెక్నీషియన్ విభాగంలో ఒక్కరోజు శిక్షణ ఇచ్చారు. డీఎంఎల్‌టీ కోర్సుల్లో చేరిన వారికి శిక్షణ సంస్థలు రెండు సంవత్సరాల పాటు శిక్షణ ఇస్తాయి. ఎంపీహెచ్‌ఏలకు కనీసం నెల రోజుల శిక్షణ లేకుండానే వారిని ల్యాబ్ టెక్నీషియన్లుగా అదనపు బాధ్యతలను అప్పగించి రోగులతో జిల్లా అధికార యంత్రాంగం ఆటలాడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హెచ్‌ఐవీ పరీక్షలను నిర్వహించాలంటే ల్యాబ్ టెక్నీషియన్‌లలో సీనియర్‌లకే సాధ్యం అవుతుంది. అలాంటిది ఒక రోజు శిక్షణ పొందిన ఎంపీహెచ్‌ఏలతో ఈ పరీక్షలు నిర్వహించడం సాధ్యం అయ్యే విషయం కాదు. ల్యాబ్ గురించి ఎలాంటి అవగాహన లేని ఎంపీహెచ్‌ఏలకు ఎల్‌టీలుగా బాధ్యతలు అప్పగించడం పెద్ద తప్పిదం అని పలువురు చెబుతున్నారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న ఎల్‌టీ పోస్టులను డీఎంఎల్‌టీ శిక్షణ పొందిన వారితో భర్తీ చేస్తే ఎంతో కొంత నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని పలువురు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఎల్‌టీ పోస్టులను అర ్హత ఉన్న డీఎంఎల్‌టీ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
శిక్షణ ఇచ్చాకే బాధ్యతలుఅప్పగించాం
-గోవింద్ వాగ్మారే,
డీఎంఅండ్ హెచ్‌ఓ, నిజామాబాద్
ఎంపీహెచ్‌ఏలకు ల్యాబ్ విషయంలో ఒక రోజు శిక్షణ ఇచ్చిన తరువాతనే ల్యాబ్ బాధ్యతలు అప్పగించాం. ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించడం సులభతరం. అందువల్లనే ఎంపీహెచ్‌ఏలతో పోస్టులను భర్తీ చేశాం. ఎంపీహెచ్‌ఏలు అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు.