తొమ్మిది పోయె.. 11 వచ్చె..! | No salaries in srikakulam zp office | Sakshi
Sakshi News home page

తొమ్మిది పోయె.. 11 వచ్చె..!

Published Wed, Jan 28 2015 10:16 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

No salaries in srikakulam zp office

శ్రీకాకుళం : జిల్లా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లకు జీతాలు చెల్లించలేని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. రెండు నెలల క్రితం జరిపిన బదిలీలు ఇష్టారాజ్యంగా ఉండడంతో ఈ దుస్థితి నెలకొంది. 2014 నవంబరు 26న తొమ్మిది మంది జూనియర్ అసిస్టెంట్లను జెడ్పీ నుంచి బదిలీ చేస్తూ అప్పటి సీఈవో నాగార్జున సాగర్ ఉత్తర్వులు జారీ చేశారు.
 
 అటు తరువాత ఆయన రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంలో కొందరు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని తమకు కావాల్సిన వారిని జూనియర్ అసిస్టెంట్లుగా తీసుకురావాలని కోరడంతో ఇన్‌చార్జ్ సీఈవో దానికి తలొగ్గారు. కొత్త సీఈవో వచ్చిన తరువాత కూడా మార్పులు, చేర్పులు, కూర్పులు జరిపారు. అయితే రాజకీయ నాయకుల సిఫార్సుల మేరకు బదిలీపై వచ్చిన వారినల్లా జాయిన్ చేసుకోవడంతో 9 మందికి గాను 11 మంది జూనియర్ అసిస్టెంట్లు అయ్యారు. వీరందరినీ విధుల్లోకి తీసుకుని సీట్లు కూడా చూపించేశారు. అయితే జీతాలు, బిల్లులు తయారు చేస్తున్నప్పుడు తొమ్మిది మందికి బదులుగా 11 మందిని విధుల్లోకి చేర్చుకున్నట్టు గుర్తించిన అధికారులు నాలుక్కర్చుకున్నారు.
 
 తర్జనభర్జన అనంతరం ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను వెనక్కి వెళ్లాలని లేని పక్షంలో జీతాలు చెల్లించేది లేదని మౌఖికంగా హెచ్చరిక తరహా ఆదేశాలు జారీ చేశారు. అయితే వీరిద్దరికీ అధికార పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యుల మద్దతు ఉండడంతో వారు ససేమిరా అన్నారు. చేసేది లేక ఓ ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను వారు గతంలో పనిచేసిన స్థానాల్లోనే కొనసాగుతున్నట్టు చూపించి జెడ్పీ కార్యాలయంలో డెప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్టు పేర్కొని జీతాలకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్ణయించారు.
 
 అయితే ఇలా పాత స్థానాల్లో పనిచేస్తున్నట్టు చూపించేందుకు సంబంధిత జూనియర్ అసిస్టెంట్లు అంగీకరించక అభ్యంతరం చెబుతుండడంతో అధికారులకు తిరిగి తలనొప్పి ప్రారంభమైంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఒక జూనియర్ అసిస్టెంట్‌కు ఆగమేఘాలపై సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించారు. దీనంతటికీ కారణమైన ప్రజాప్రతినిధులు మాత్రం హాయిగానే ఉండగా ఒత్తిడికి తలొగ్గిన అధికారులు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ వ్యవహారంపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఏం చేయాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు.
 
 ఇదిలా ఉంటే అప్పట్లో జరిగిన బదిలీల్లో మార్పులు చేయాలని ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగుతుండడంపై తీవ్ర ఆక్షేపణలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆమదాలవలస నియోజకవర్గంలోని ఓ ఎంపీడీవో కార్యాలయం నుంచి బదిలీపై తీసుకువచ్చిన ఉద్యోగినిని వెనక్కి పంపించాలని, అక్కడ పనిచేస్తున్న ఉద్యోగిని యథావిధిగా కొనసాగించాలని ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే విధుల్లో చేరిన ఉద్యోగిని వెనక్కి వెళ్లేందుకు నిరాకరిస్తూ తనకు తెలిసిన రాజకీయ పలుకుబడిని వినియోగించడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు డైలమాలో పడ్డారు. అయితే ఈ వ్యవహారం ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ప్రతిష్టాత్మకంగా మారింది. వీరిద్దరిలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిందే.
 
 విషయాన్ని జెడ్పీ సీఈవో వసంతరావు వద్ద సాక్షి ప్రస్తావించగా తాను విధుల్లో చేరే సరికే బదిలీలు పూర్తయ్యాయన్నారు. జూనియర్ అసిస్టెంట్ల వ్యవహారంలో ఏదో పొరపాటు ఉన్నట్టు ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం వారు చెప్పారే తప్ప ఫైల్ తన వద్దకు పంపలేదన్నారు. పూర్తి పరిశీలన జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement