వీరఘట్టం, న్యూస్‌లైన్ : వంట గ్యాస్‌పై సబ్సిడీని పొందటానికి వినియోగదారులు పడుతున్న కష్టాలు మరో మూడు రోజు ల్లో తీరనున్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి పాత విధానంలోనే సబ్సిడీ గ్యాస్ సిలిం డర్ అందనుంది. ఈ మేరకు గ్యాస్ కంపెనీల నుంచి జిల్లాలోని ఏజెన్సీలకు గురువారం సర్క్యులర్ అందింది. ఇప్పటివరకు గ్యాస్ కనెక్షన్‌తో బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్లను అనుసంధానం చేసుకుంటేనే సబ్సిడీ వర్తిస్తుండటంతో వేలాది మంది వినియోగదారులు నష్టపోతున్నారు. జిల్లాలో చాలామందికి ఇప్పటికీ ఆధార్ కార్డులు రాకపోవటం, వినియోగదారులిచ్చిన వివరాలను గ్యాస్ ఏజెన్సీ లు, బ్యాంకుల సిబ్బంది సరిగా నమోదు చేయకపోవటమే ఈ పరిస్థితికి కారణం. దీనివల్ల సిలిండర్ మొత్తం ధరను వినియోగదారుడే భరించాల్సి వస్తోంది. ఈ భారాన్ని భరించలేక పలు ప్రాంతాల్లో వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలు, బ్యాంకుల సిబ్బందితో వాగ్వాదాలకు దిగుతున్నారు కూడా.
ఈ నగదు బదిలీ విధానంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాత విధానంలోనే సబ్సిడీ సిలిండర్లను అందించాలని గ్యాస్ సంస్థలను ఆదేశించింది. జిల్లాలో 2,99,341 మంది గ్యాస్ వినియోగదారులున్నారు. వీరికి హెచ్‌పీ, భారత్, ఇండేన్ సంస్థలకు చెందిన 20 ఏజెన్సీలు సిలిండర్లను పంపిణీ చేస్తున్నాయి. కేంద్రం ఆదేశాల మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి 430-440 రూపాయలకే సిలిండర్ అందనుండటం వినియోగదారులకు ఊరట కలిగించనుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంతో దళారులు మళ్లీ విజృంభించి అక్రమాలకు పాల్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల అధికారి సీహెచ్.ఆనంద్‌కుమార్‌ను ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా గ్యాస్ సబ్సిడీ చెల్లింపునకు ఆధార్, బ్యాంకు లింకేజీని రద్దు చేస్తూ జారీ చేసిన సర్క్యులర్ గురువారం తమకు అందిందని, ఈ నెల 10వ తేదీ నుంచి పాత విధానంలోనే సబ్సిడీ సిలిండర్లు పంపిణీ చేస్తారని వివరించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు.
గ్యాస్ సబ్సిడీ సమస్యకు తెర!
Published Fri, Mar 7 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement
Advertisement