స్థలం లేక వాహనాల సీజ్ లేదట!
స్థలం లేక వాహనాల సీజ్ లేదట!
Published Sat, Nov 5 2016 7:53 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM
⇒ పట్టుకున్న వాహనాలకు పార్కింగే సమస్య
⇒ రెండు నెలలుగా ‘సీజ్’ మాటే మరిచిన రవాణా అధికారులు
గుంటూరు (నగరంపాలెం): నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు తిరుగుతున్నా రవాణా అధికారులు రెండు నెలలుగా సీజ్ చేయడం లేదు. అదేంటీ...రూల్స్ ఏమైనా మారాయా అనుకుంటున్నారా...ఏమీ కాదు... సీజ్ చేసిన వాహనాలను ఎక్కడ పెట్టాలో తెలియక.. పార్కింగ్ సమస్యతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మోటార్ వెహికల్ యాక్ట్‌కు విరుద్ధంగా ప్రయాణిస్తున్న వాహనాలను మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు గుర్తిస్తే వాటిపై కేసులు నమోదు చేసి వెంటనే సీజ్ చేస్తారు. సీజ్ చేసిన ప్రాంతానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో గానీ, ఆర్టీసీ బస్ డిపోలలో గానీ వాహనాలను తరలిస్తారు. అయితే అన్ని పోలీస్ స్టేషన్ల ప్రాంగణాలలో గ్రీనరీ పెంపొందించి సుందరంగా తీర్చి దిద్దాలని రెండు నెలల క్రితం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్‌లలో ఉన్న సీజ్ చేసిన వాహనాలు తీసుకువెళ్లాలని, కొత్తగా సీజ్ చేసిన వాహనాలు తీసుకురావద్దంటూ సంబంధిత ఎస్‌హెచ్‌వోలు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లకు సమాచారం అందించారు. ఆర్టీసీ బస్ డిపోలలో సైతం సీజ్ చేసిన వాహనాలు నిలపడానికి ఆర్టీసీ అధికారులు అనుమతించటం లేదు.
స్థలాల కొరతే ప్రధాన సమస్య..
జిల్లాలో రవాణాశాఖకు గుంటూరు, నర్సరావు పేటలో ఆర్‌టీఏ కార్యాలయాలు.., తెనాలి, పిడుగురాళ్ళలో యూనిట్ కార్యాలయాలు.., మాచర్ల, చిలకలూరిపేట, బాపట్ల, మంగళగిరిలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టరు కార్యాలయాలు ఉన్నాయి. గుంటూరు ఆర్‌టీఏ కార్యాలయం మినహా మిగతా అన్నీ అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయి. నర్సరావుపేటలో ఆర్‌టీఏ కార్యాలయం, టెస్టింగ్ ట్రాకు, సీజ్ చేసిన వాహనాలు పార్కింగ్‌కు ఐదు ఎకరాల స్థలం కావాలని, తెనాలి , పిడుగురాళ్ల యూనిట్ కార్యాలయాలకు రెండు ఎకరాల స్థలం కావాలని, మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలకు స్థలాలు కేటాయించాలని రవాణా శాఖ అధికారులు జిల్లా యంత్రాగానికి పలుమార్లు లేఖలు రాసారు. ఇప్పటికీ స్థలాల కేటాయింపుపై సూత్ర ప్రాయంగా అంగీకారం కూడా రాలేదు. రవాణా శాఖ కార్యాలయాల వద్ద సీజ్ చేసిన వాహనాలు పార్కింగ్ చేసుకోవటానికి స్థలాలు లేకపోవటంతో రెండు నెలలుగా జిల్లాలో ఎంవీఐలు వాహనాలు సీజ్ చేయటం నిలిపివేశారు. తనిఖీలలో జరిమానాలు , కేసులూ మాత్రమే నమోదు చేస్తున్నారు.
స్థలం లేక ఇబ్బంది..
తనిఖీ సమయంలో సీజ్ చేసిన వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో పార్కింగ్ చేసేందుకు రవాణాశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా రాజధాని ప్రాంతంగా మారటంతో స్థలాల లభ్యత కష్టంగా ఉంది. నరసరావుపేటలో ఆర్‌టీఏ కార్యాలయానికి ఐదు ఎకరాల స్థలం సేకరించేం దుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లలలో, ఆర్టీసీ డిపోలలో తాత్కాలికంగా అయినా సీజ్ చేసిన వాహనాలు పార్కింగ్ చేయటానికి సంబంధిత అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో వాహనాలు సీజ్ చేయటం గత రెండునెలలుగా జిల్లాలో గణనీయంగా ఎంవీ ఐలు తగ్గించారు. జిల్లా యంత్రాంగం స్థలాల కేటాయింపుపై సానుకూలంగా స్పందిస్తే సమస్య పరి ష్కారమవుతుంది.
– జీసీ రాజరత్నం, జిల్లా ఉపరవాణా అధికారి
Advertisement