పరిశో‘ధనం’ లాభదాయకం
సాక్షి, హైదరాబాద్: శాస్త్ర పరిశోధనలకు ఎందుకు ఎక్కువ నిధులు కేటాయిం చాలని మథనపడే రాజకీయవేత్తలు బోయింగ్ లాంటి అంతర్జాతీయ కంపెనీలను చూసి నేర్చుకోవాలని నోబె ల్ అవార్డు గ్రహీత ఒలివర్ స్మితీస్ వ్యాఖ్యానించారు. ఎంత ఎక్కువ పెట్టుబడులు పెడితే అంత ఎక్కువ లాభాలిచ్చే రంగం పరిశోధనలేనని ఆయన స్పష్టం చేశారు. పరి శోధనల ద్వారానే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయని, తద్వారా కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని అన్నారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) 26వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ఒలివర్ స్మితీస్ ముఖ్యఅతి థిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ‘కొత్త ఆలోచనలు ఎలా వస్తాయన్న’ అంశంపై ఆయన యువ శాస్త్రవేత్తలనుద్దేశించి చేసిన ప్రసంగం ఆహూతులను ఆకట్టుకుంది. వ్యాధుల నిర్ధారణకు చవకైన పద్ధతులను అభివృద్ధి చేసేందుకు సీసీఎంబీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని సంస్థ డెరైక్టర్ డాక్టర్ మోహన్‌రావు తెలిపారు. గత ఏడాది వ్యవస్థాపక దినోత్సవం తరువాత సీసీఎంబీలో చేపట్టిన కొత్త పరిశోధనల గురించి ఆయన వివరించారు. కిడ్నీ వ్యాధులను చవకైన పద్ధతుల్లో గుర్తించేం దుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని తెలిపారు. వయోవృద్ధుల్లో కనిపించే అనేక సమస్యలకు పరిష్కారాలు వెతికేందుకు బయోఏజ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు.